MLA Naini Rajendar Reddy Kazipet Coach Factory Jobs
అకేరు న్యూస్ వరంగల్ : కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూ సేకరణ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే యాక్ట్ అప్రెంటిస్ చేసిన యువకులకు, స్థానిక నిరుద్యోగులకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 80 శాతం ఉద్యోగాలను కేటాయించాలని ఏమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మాడికొండ నుంచి కాజీపేట జంక్షన్ వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన, ఫ్యాక్టరీలో సుమారు 3 వేల ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని కోరారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
* కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలపై ప్రకటన చెయ్యాలి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి అనేక కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్చువల్ గా ప్రారంభోత్సవం చేస్తున్నారని, మొదట మామునూరు ఎయిర్ పోర్ట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ఉన్నాయని ప్రకటించి తరువాత వరంగల్ జిల్లా బిజెపి నాయకుల అభిప్రాయం మేరకు ఈ రెండింటినీ వాయిదా వేశారని స్వయంగా ప్రధానిని ఈ ప్రాంతాలకు తీసుకువచ్చి ప్రారంభోత్సవాలు చేయించి దాని ద్వారా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని స్థానిక బిజెపి పార్టీ నాయకులు భావిస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇన్ని ఆలోచనలు చేసే నాయకులు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చండని అడిగే ధైర్యము లేదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా స్థానిక బిజెపి నాయకులు రాష్ట్రంలోని ఎనిమిది మంది ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించి రైతులకు ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని లేకుంటే రైతు వ్యతిరేకులుగా మాట నిలబెట్టుకోలేని నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని నాయిని రాజేందర్ రెడ్డి ఎద్దేవ చేశారు.
