* ములుగు అడవుల్లో మహా విపత్తు
* డ్రోన్ కెమెరాలతో అంచనా వేయాలని మంత్రి సీతక్క ఆదేశం
* భారీ సుడిగాలితో నష్టం..
* అదే గాలి గ్రామాల్లో వస్తే ప్రాణనష్టం సంభవించేంది
ఆకేరు న్యూస్, ములుగు : భారీ వల్ల వచ్చిన అతి పెద్ద సుడిగాలితో ములుగు (MULUGU)జిల్లాలోని మేడారం – తాడ్వాయి అటవీ ప్రాంతంలో మహా విపత్తు సంభవించింది. 500 ఎకరాల్లో దాదాపు 78 వేల చెట్లు నేలకూలాయి. డ్రోన్ కెమెరాలతో పూర్తిస్థాయిలో అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క (MINISTER SEETHAKKA)తెలిపారు. సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ వో లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే సుడిగాలి గ్రామాల్లో వచ్చి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం స్పందించాలి..
ఈ మహా విపత్తుపై స్పందించి కేంద్రం సహకారం అందించాలని సీతక్క కోరారు. తిరిగి మొక్కలు నాటేందుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సుడిగాలి కొండపర్తి గ్రామంపై కూడా ప్రభావం చూపిందని, కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. సుడిగాలి ఎలా వచ్చింది, నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విపత్తు గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.