* రైతులకిచ్చే రుణ పరిమితి పెంపు
* రూ1.60 లక్షల నుంచి రూ.2లక్షల పరిమితిని పెంపు
* ఉత్తర్వులు జారీచేసిన ఆర్బీఐ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: రైతులకు ఆర్బీఐ శుభవార్త తెలిపింది. వ్యవసాయ అవసరాలకు, పంటల సాగుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు ఇవ్వాల్సిన గరిష్ఠ రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ1.60 లక్షల నుంచి రూ.2లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే నెల ఒకటిలోగా ఈ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. రుణ పరిమితి పెంచినట్లు రైతులందరికీ తెలిసేలా అన్ని మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది. వ్యవసాయ అనుబంధ పనులు చేపట్టేవారికి కూడా ఈ పెంపుదల వర్తిస్తుందని పేర్కొంది. పంటల సాగుకు రైతులు పెడుతున్న వ్యయం, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో ఈ రుణం పరిమితి కేవలం రూ.10వేలే ఉంది. 20ఏళ్ల వ్యవధిలో రైతులకు పంట సాగు ఖర్చులు 20 రేట్లు పెరిగినట్లు అర్థమవుతుందని సీనియర్ బ్యాంకు ఉన్నాతాధికారి ఒకరు ఈటీవీ భారత్కు తెలిపారు.సాధారణంగా భూ యజమానులు పంట సాగుచేసినా సాగుచేయకున్నా బ్యాంకుల నుంచి పంటరుణం తీసుకుంటున్నారన్నారు. ఇందుకు ఎలాంటి పూచీకత్తును బ్యాంకులు తీసుకోవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు పాస్? పుస్తకాలను పూచీకత్తు కింద పెట్టుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 30శాతానికి పైగా భూములను యజమానులు కౌలుకు ఇస్తున్నారు. కౌలుదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉండవనే కారణంగా బ్యాంకులు వారికి పంటరుణాలు ఇవ్వడం లేదు. కౌలు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పూచీకత్తు అడగకుండానే పంటల సాగుకు రుణం ఇవ్వాలని ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇలా ఆదేశాలిస్తున్న చాలా బ్యాంకులు ఈ విషయాన్ని అమలు చేయడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో తాకట్టు లేకుండా కౌలు రైతులకు పంటరుణాలు అందక, ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని ఆర్థికభారంతో నలిగిపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఈటీవీ భారత్తో అన్నారు. వారికి కూడా పూచీకత్తు లేకుండా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మాదిరిగా ఎంతమందికి రుణాలు ఇచ్చారని కమిషన్కు వివరాలు అందజేయాలని బ్యాంకులను కోరినట్లు వివరించారు. భూమి ఉన్నా లేకున్నా వ్యవసాయ సంబంధ వ్యాపారం చేయాలి అనుకుంటే లేదా అగ్రి క్లినిక్ ఏర్పాటు చేయదలుచుకుంటే తాకట్టు లేకుండా రూ.5లక్షల వరకూ లోన్ ఇవ్వాలని 2004 మే 18న రిజర్వ్? బ్యాంకు ఆదేశాలిచ్చింది. అగ్రి క్లినిక్ అంటే పంటల సాగుకు అవసరమైన సలహాలు, సూచనలను రైతులకు ఇవ్వడమేకాకుండా వ్యవసాయనికి అవసరమైన అధునాతన సామగ్రిని విక్రయించడానికి నిరుద్యోగులు ఏర్పాటు చేసుకునే వ్యవసాయ సేవా సంస్థ. ఇలాంటి సేవా సంస్థలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులు అటు రైతులకు సేవలందిస్తూ ఇటు స్వయం ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలో బ్యాంకులు పూచీకత్తు లేకుండా ఈ రుణాలను ఇవ్వకపోవడం వల్ల వీటిని ఏర్పాటు చేయడం నిరుద్యోగులకు సాధ్యపడటం లేదని అధికారులు తెలిపారు.
…………………………………