నిజాం నవాబు కేసీఆర్ అయితే..
* రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ .. మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు
ఇదీ సీఎం రేవంత్ రెడ్డి మాట ..
* ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కోసం పోలీసుల వేట
* అమెరికాకు వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు
* టీవీ చాన్ల్ నిర్వాహకుడు శ్రవణ్ , మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఇళ్ళల్లో సోదాలు
* టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నల ఇళ్ళల్లోనూ తనిఖీలు
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్ : నిజాం నవాబు మాజీ సీఎం కేసీఆర్ అయితే .. రజాకార్ సైన్యం నాయకుడు ఖాసీం రజ్వీ …నేటి మాజీ ఇంటలీజెన్స్ చీప్ ప్రభాకర్ రావు ( Parabhakar Rao ) .. ఈ వ్యాఖ్యలు చేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Reavanth ReddY ) . ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద మీడియా కార్యక్రమంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ( Mir usman ali khan ) ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా నిర్భందంలో ఉంచారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట రూపంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. దీన్ని అణచి వేసేందుకు నిజాం నవాబు తన చేతికి మట్టి అంటకుండా రజాకార్ పేరుతో ఖాసీం రజ్వీ నాయకత్వంలో ప్రజలను ఊచకోత కోశారు. అలాంటి ఉదాహరణలతో సీఎం రేవంత్ రెడ్డి ఖాసీం రజ్వీ తో మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును పోల్చారు. ఈ వ్యాఖ్యల సారాంశాన్ని పరిశీలిస్తే .. గత ప్రభుత్వంలో ప్రభాకర్ రావు పాత్ర ఎంత క్రియా శీలకంగా ఉన్నదని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడోనన్నది అర్థమవుతుంది. అందుకోసమే ప్రభాకర్ రావు ను అదుపులోకి తీసుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడుగులు కదుపుతున్నారని అర్థమవుతోంది.
ఉద్యోగ ధర్మం వదిలేసి , గత సీఎం కేసీఆర్‌కు తాబేదార్గా పనిచేస్తున్నా వని గతంలో కూడా ప్రభాకర్ రావు ను బహిరంగంగానే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సమాజంలో పెరిగిపోతున్న శాంతి భద్రతల సమస్య, అసాంఘీక, అరాచక శక్తులు, మత కల్లోలాలు, నక్సలైట్ కార్యకలాపాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు అవసరమైన చర్యల కోసం ప్రభుత్వానికి సమాచారం అందించడం ఇంటలీజెన్స్ విభాగం ప్రధాన విదిగా ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాటిని వదిలేసి విపక్ష పార్టీల కార్యకలాపాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఎస్ఐబీ పనిచేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో పర్యటించి ఫోన్ ట్యాపింగ్ కోసం అవసరమైన అత్యాధునికమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది. మాజీ సీఎం కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ రావు అదే సామాజిక వర్గానికే చెందిన ఇతర అధికారులను కొంత మందిని తన ప్రత్యేక టీమ్‌లో చేర్చుకున్నట్టు పోలీస్‌లు గుర్తించారు. వీరంతా విపక్ష నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యంగా చేసుకుని వారి దిన చర్యను గమనించడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది. పోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు ఎస్ఐబీ కార్యాలయంలోని కీలక ఆధారాలను ధ్వసం చేయడంతో కేసు తీవ్రత మరింత పెరిగింది. ఈ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాదించే అవకాశాలు కూడా ప్రభాకర్ రావు టీం కు లేకుండా పోయింది. చట్ట బద్దమైన నిఘా కార్యకలాపాలే చేసి ఉంటే ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
* ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు
తీగ లాగితే డొంక కదులుతోందని పోలీసులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో హైదరాబాద్ పోలీస్‌లు స్పీడు పెంచారు. ఇప్పటికే అదుపులో ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారిస్తున్న పోలీసులకు సరికొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎంతమందిని చేశారు..?. ఎవరెవరి పోన్ కాల్స్ ట్యాప్ చేశారు…? ఎవరి ఆదేశాల మేరకు చేశారు..? ఇందులో నాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా..? అసలెందుకు హార్డ్ డిస్క్‌లను ధ్వసం చేయాల్సి వచ్చింది..? అందులో ఎవరి సమాచారం నిక్షిప్తమయి ఉంది..? ట్యాపింగ్ కోసం ఎలాంటి పరికరాలు వాడారు, వాటిని ఎక్కడినుంచి తెచ్చారు..? ధ్వంసం చేసిన శకలాలను ఎక్కడ పడేశారు ..? అన్న అంశాలకు సంబందించి ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగాగనే మీడియా యజమాని శ్రవణ్‌కుమార్ , మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లోనూ పోలీస్‌లు తనిఖీలు నిర్వహించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌లు విదేశాలకు వెళ్ళినట్లు తెలుసుకున్నారు. మీడియా యజమాని శ్రవణ్ కుమార్ ఇంట్లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబందించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం . టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీతో పాటు , ఎస్ఐబీ అధికారులు భుజంగరావు, తిరుపతన్నల ఇళ్ళల్లోనూ పోలీస్ లు సోదాలు నిర్వహించారు.విచారణలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్లతో పాటు స్వామీ కార్యంతో పాటు స్వకార్యం నెరవేర్చుకునేందుకు ఏకంగా 20 మందికి పైగా బడా వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఆ బడా వ్యాపారుల పై నిఘా పెట్టడం ద్వారా వారి వ్యాపార రహస్యాలను తెలుసుని వారి నుంచి ఆర్థికంగా లబ్ది పొందే వారని తెలుస్తోంది. మరో వైపు వీరి సమాచారాన్ని ప్రత్యర్థి వ్యాపారులకు అందజేయడం వల్ల కూడా ఆర్థిక ప్రయోజనం పొందే వారంటున్నారు.
* ప్రభాకర్ రావు జైలు కెళ్ళాల్సిందేనా..?
ఎస్ ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ద్వారా తేలిన అంశాలన్నీ ఆ సంస్థ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టే తిరుగుతున్నాయి. ఎస్ ఐబీ విభాగానికి చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాలు లేకుండా కింది స్థాయి అధికారులు ఇంత పెద్ద కార్యక్రమాలు ఏ విదంగా చేయగలడన్న ప్రశ్నలు తలెత్తుతాయని పోలీస్ అధికారులే అంటున్నారు. దీంతో ప్రణీత్ రావు విచారణ అనంతరం కేసు ప్రభాకర్ రావు చుట్టే తిరుగుతుంది . ప్రభాకర్ రావును విచారించడమే పోలీస్‌ల తరువాతి అంశంగా కనపిస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాలన్న లక్ష్యంతో పోలీస్ లు కదులుతున్నారు. ఆయన ఇప్పటికే అమెరికా వెళ్ళాడన్న సమాచారం ఉండడంతో విచారణకు ఇప్పట్లో హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభాకర్ రావు ప్రత్యేక బృందంలోని ఇతర పోలీస్ అధికారులను కూడా విచారిస్తున్నారు. అమెరికా నుంచి ప్రభాకర్ రావును రప్పించడమే లక్ష్యంగా పోలీస్ అధికారులు ఇపుడు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అవసరమైన న్యాయ సలహాలను తీసుకుంటున్నారు.
* అప్పటి నేతల పేర్లేమి చెప్పలేదా ..?
ప్రణీత్ రావు విచారణలో గత ప్రభుత్వంలోని పెద్దల పేర్లు ఏమైనా చెప్పారా..? వెల్లడించినప్పటికీ పోలీస్‌లు బయటకు చెప్పడం లేదా అన్న విషయం రెండు రోజుల్లో తేల నుంది. ఇంటలీజెన్స్ విభాగం అధిపతులైనా , అధికారులైనా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకుంటారు. విపక్ష నేతలను టార్గెట్ గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేయడం అధికారులకు ఏం అవసరంగా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎవరైనా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నామని అధికారులు చెబుతారా..? అలా చెబితే .. పోలీస్‌లు నాటి పెద్దలను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది..
———————–