
* ఢిల్లీ పీఠం ఇక కమళానిదే..
* ఆప్‌ను ఊడ్చి పారేసిన ఢిల్లీ ప్రజలు
* జైలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి
* పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం
* చివరి రౌండులో బయటపడ్డ సీఎం అతిషి
* ఖాతా తెరవని కాంగ్రెస్ పార్టీ
ఆకేరున్యూస్, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరవాత బిజెపి అధికారం చేపట్టబోతోంది. అవినీతిని ఊడ్చేస్తానంటూ గద్దెనెక్కిన ఆప్‌ను ప్రజలు ఊడ్చి పడేశారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికలకు సంబంధించి శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. 70 సీట్లకు గాను బిజెపి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 47 సీట్లలో ఆధిక్యం ప్రదర్శించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కౌంటింగ్‌లో కనిపించాయి. కాంగ్రెస్ ఎక్కడా ఖాతా తెరవలేదు. మొత్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోంది. ఫలితాలపై బిజెపి హర్షం వ్యక్తం చేయగా, ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లిని కేజీవ్రాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ ఓడిపోవడం గమనార్హం. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. కమలదళం హోరులో.. గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకుపోయింది. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటి 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యం సాధించలేకపోయింది. దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ.. కాల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆది నుంచి వెనుకంజలో ఉన్న ఆమె చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకున్నారు. భాజపా అభ్యర్థి రమేశ్ బిధూరిపై 3,521 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ షాకూరి బస్తీలో ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి కర్నాల్ సింగ్ 20,998 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో భాజపా నాయకురాలు శిఖా రాయ్ 3,188 ఓట్ల తేడాతో నెగ్గారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి భాజపా నేత కైలాశ్ గెహ్లోత్ విజయం సాధించారు. తన సవిూప ఆప్ అభ్యర్థి సురేందర్ భరద్వాజ్‌పై 9,833 ఓట్లతో గెలుపొందారు. భాజపా నేత అర్విందర్ సింగ్ లవ్లీ గాంధీ నగర్లో విజయం సాధించారు. ఆప్ అభ్యర్థిపై 12,748 ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
……………………………………………….