* 13 మంది మావోయిస్ట్‌ల మృతి
* భారీగా ఆయుధాలు లభ్యం
* లోక్ సభ ఎన్నికల వేళ దండకారణ్యంలో కలకలం
ఆకేరు న్యూస్ , ఖమ్మం : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దండకారణ్యంలో అలజడి రేగుతోంది. సీపీఐ మావోయిస్ట్ పార్టీ దళాలకు, ప్రత్యేక పోలీస్ బలగాలకు మద్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. బీజాపూర్ లోని కోర్పోలి లేంద్ర అడవుల్లో పోలీస్‌లకు మావోయిస్ట్‌లకు మద్య జరిగిన ఎన్ కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ రేంజీ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు. దాదాపు మూడు గంటలకు పైగా ఇరువర్గాల మద్య కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల సమావేశం అవుతున్నారన్న సమాచారంతో కూంబింగ్‌కు వెళ్ళిన కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్ట్‌లు కంటబడడంతో ఎన్కౌంటర్ మొదలయిందన్నారు. అనంతరం పరిశీలిస్తే 13 మంది మావోయిస్ట్‌ల మృతదేహాలు లభ్యమయినాయని పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్‌కు సంబందించిన అధునాతన ఆయుధాలు, కిట్ బ్యాగులు, జిలిటెన్ స్టిక్స్, మందుపాతరలు ఇతర సామాగ్రి లభ్యమయినాయన్నారు. బ్యారెల్ గ్రైనేడ్ లాంచర్ లాంటి ఆయుధాలు లభ్యం కావడం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్ట్‌లకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. వేసవి కాలం మావోయిస్ట్‌లకు ప్రతికూలమైనదిగా భావిస్తారు. తమను కాపాడుకోవడం కోసం ప్రత్యేకంగా టీసీవోసి ( టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ ) వ్యూహాన్ని అమలు చేస్తా రని ఐజీ తెలిపారు.
* ఎన్నికలకు ముందే హోరా హోరి..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి ఆయువుపట్టయిన చత్తీష్ గడ్‌లో యుద్ధవాతావరణం నెలకొన్నది. ఈనెల 19న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్ట్‌లు దాడులు చేసే అవకాశాలున్నాయని పోలీస్‌లు అప్రమత్తమయినారు. దండకారణ్యాన్ని ప్రత్యేక పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎన్ కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. మూడు నెలల కాలంలో చాలా సార్లు ఎన్ కౌంటర్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. 40 మందికా పైగా మావోయిస్ట్‌లు మృతి చెందారు. ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్లకు నిరసనగా నేడు ( 3 ఎప్రిల్ ) బీజాపూర్, సుకుమా జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు.బంద్‌నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి..
————————–