అంగీకరించిన మైనర్..?
కొనసాగుతున్న దర్యాప్తు
టీడీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు : పట్టాభి
ఆకేరు న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్పై రాయి దాడి కేసు కొలిక్కి వస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఓ యువకుడు తానే రాయి విసిరినట్లు అంగీకరించాడని తెలుస్తోంది. విజయవాడలోని వడ్డెరకాలనీకి చెందిన పది మంది యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఓ యువకుడు (మైనర్) తానే దాడి చేసినట్టుగా చెప్పినట్లు గా ప్రచారం జరుగుతోంది. . ఈ విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పక పోయినా.. దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. బెజవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో.. పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల అదుపులోకి తీసుకున్నవారిలో ఆరుగురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ ఫోన్ల పరిశీలన
జగన్ పైదాడి జరిగిన వివేకానంద స్కూల్, గంగాలమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో ఆ సమయంలో ఎక్కువగా జరిగిన ఇన్ కమింగ్, ఔట్ ఫోన్ల పై నిఘా పెట్టి.. పోలీసులు ఇంకా లోతుగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా మిగతా అనుమానితుల సెల్ ఫోన్ డేటాను తెప్పించి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాటిలో అనుమానాస్పదంగా ఉండే కాల్స్, ఒకే నంబరు నుంచి ఎక్కువసార్లు వెళ్లిన ఫోన్లపై పోలీసులు దృష్టి పెట్టారు.
వడ్డెరబస్తీలో ఆందోళన
అనుమానం పేరుతో తమ పిల్లలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వడ్డెర కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో తమ పిల్లల్ని పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. కాగా, విజయవాడలో ముఖ్యమంత్రిపై గులక రాయి దాడి ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు ఎలక్షన్ కమిషన్కు తమ లేఖను అందజేశారు. ఇందులో రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, సీఎం భద్రతా అధికారినీ బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ చేయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
టీడీపీ నేతలను ఇరికించే కుట్ర
ఈ కేసులో టీడీపీ నేతలను ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నేత పట్టాభి ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుడు, వడ్డెర సంఘం నేత వేముల దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ద్వారా బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాగా, బోండా ఉమ ఫోను నిన్న రాత్రి నుంచీ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని మరో నేత వర్ల రామయ్య డీజీపీని కోరారు.
——————-