* పల్లీ బఠాణీలు అమ్ముకునేవారు కూడా..
* కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకే పార్టీని వీడుతున్నారు..
* గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, నల్గొండ : శాసనమండలి చైర్మన్, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని, నాయకత్వంపై నమ్మకం లేకనే నాయకులు పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి పల్లీ, బఠాణీలు అమ్ముకునే నాయకులు కూడా కోటీశ్వరులు అయ్యారని షాకింగ్ కామెంట్లు చేశారు. నల్గొండ జిల్లాలో కొందరు లిల్లీ ఫుట్ లను కేసీఆరే తయారు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు, నేతల సహాయ నిరాకరణ వల్ల అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని తెలిపారు. బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలు కూడా అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
త్వరలో బీఆర్ఎస్ కు గుడ్ బై ?
గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన కాంగ్రెస్లో చేరతారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే బీఆర్ఎస్ పై అసంతృప్తిని వెళ్లగకక్కారు. గుత్తా పార్టీని వీడితే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగలుతుంది. తాజాగా నిన్న మాజీ ఎంపీ రవీంద్రనాథ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా నేడో, రేపో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈమేరకు నిన్న ఆయన అనుచరులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారపార్టీలోకి వెళ్లనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యారు.
——————————————————-