* కూటమిలో ఆకస్మిక చర్యలు
* వైసీపీతో పోటీ వల్లేనా?
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఈమేరకు ఉదయం నుంచే బాబు నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం ఏర్పడింది. కూటమి పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కేటాయించిన సీట్లు పోగా, తెలుగుదేశం పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లోని అభ్యర్థులకు ఈ బీఫామ్‌లు అందజేశారు. కాగా, ముందు ప్రకటించిన సీట్లలో ఐదుగురు అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చడం చర్చనీయాంశంగా మారింది. కొత్త గా తెలుగుదేశం నుంచి సీట్లు పొందిన వారిలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గిడ్డి ఈశ్వరి, ఉండి రామకృష్ణరాజుకు, మడకశిర ఎమ్మెస్ రాజుకు, మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి, వెంకటగిరి రామకృష్ణరాజు ఉన్నారు. కాగా చివరి వరకు ఉండి సీటుపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. తొలుత ఆ సీటును మంతెన రామరాజుకు కేటాయించారు. రఘురామకృష్ణంరాజుకు ఎంట్రీతో సీన్ మారిపోయింది. అయితే ఈరోజు వరకూ ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. పోటీలో ఉండి తీరతానని చెప్పారు. కాగా, చివరి నిమిషంలో అధినేత చంద్రబాబు నాయుడి బుజ్జగింపు, ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తానన్న హామీతో ఆయన మెత్తబడ్డారు. కాగా, చివరి నిమిషంలో కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పునకు కారణం వైసీపీతో పోటీ పెరగడం వల్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
—————————————————-