
– జనగామ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
ఆకేరు న్యూస్, జనగామ: ప్రజలందరి సహకారంతో జనగామ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జనగామ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ స్పష్టం చేశారు. జనగామ మున్సిపాలిటీలో పరిశుభ్రత కొరకు వందరోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై సమీక్షించారు. జూన్ 2వ తేదీ నుండి 100 రోజుల ప్రణాళిక అమలు పరుస్తున్నామని సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మున్సిపాలిటీ లో 30 వార్డ్ లు ఉన్నాయి. ప్రతి వార్డులలో పనులు ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులను మున్సిపల్ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రత పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని, ముందుగా నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయుస్తున్నామన్నారు. సాయి నగర్, శివాలయం వీధి, కుర్మవాడ, అంబేద్కర్ నగర్, గిర్ని గడ్డ, సంజయ్ నగర్, రెడ్డి స్ట్రీట్, గీతా నగర్, వీవర్స్ కాలనీ లలో కాలువలను శుభ్ర పరిచామన్నారు. మురికి కాలువలలో ఆయిల్ బాల్స్ వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రోజువారీగా తడి, పొడి చెత్త సేకరణ పై ఫోకస్ పెట్టామన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ చేపడుతూ, చెత్త చెదారం రోడ్లపై వేస్తే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి సారిగా వేస్తే 2 వేలు, 2వ సారి చెత్త వేస్తే 5వేలు జరిమానా విధిస్తున్నామన్నారు. ప్రతిరోజూ చేపట్టిన పనులపై ఫోటో తీస్తూ రికార్డుల్లో నమోదు చేస్తున్నామన్నారు. కూరగాయల మార్కెట్ మాంసపు దుకాణాల వద్ద వ్యర్ధాలను తొలగింప చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ అశ్రద్ధ చేయరాదని అధికారులకు సూచించామన్నారు. సాయినగర్ ఏరియా, హైదరాబాద్ రోడ్, హన్మకొండ రోడ్ కిరువైపులా ఉన్న పెద్ద మురికి కాలువలను శుభ్రం చేయించా మన్నారు. అలాగే సెయింట్ మెరిస్ స్కూల్ వెనుక జి.ఎమ్.ఆర్. కాలనీలో పెద్ద డ్రైనేజి లను శుభ్రపరచడం జరిగిందన్నారు. రోడ్లకు ఇరువైపులా మట్టిని, పిచ్చి మొక్కలను తొలగిస్తూ శుభ్ర పరుస్తున్నామన్నారు. జయశంకర్ కాలనీలో కచ్ఛ కాలువలను శుభ్ర పరిచామన్నారు. మట్టి కుప్పలు తొలగిస్తూ, మురికి కాలువలలోని సిల్ట్ ను జె.సి.బి.తో తొలగించామన్నారు. కమర్షియల్ ఏరియాల్లో రాత్రి వేళల్లో చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు. ప్రజల సహకారంతో ముందుకు పోతూ స్వచ్ఛత దిశగా జనగామ మున్సిపాలిటీ ని క్లీన్ టౌన్ గా అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు.
……………………………….