
* ఆయన ఎందుకలా చేశారు?
* చర్చనీయాంశంగా ఏపీ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ ఎపిసోడ్
* రాజకీయంగానూ ప్రకంపనలు
* కూటమి వేధింపులే కారణమంటున్న వైసీపీ
* కుటుంబం కోసమే అంటున్న కౌశల్
* కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్లనున్నారా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిగా ఆయనకు ఇంకా 20 ఏళ్ల సర్వీసు ఉంది. విధి నిర్వహణలో డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ అన్న పేరూ ఉంది. కానీ అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధాన మీడియాలోనూ పలు రకాల వార్తా కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఆయనే ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారు? విపక్ష ఆరోపణలు నిజమేనా? కౌశల్ ఏమంటున్నారు? ఆకేరు న్యూస్ స్పెషల్ స్టోరీ..
సింహస్వల్పం లాంటి వ్యక్తి ఎందుకలా చేశారు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ కు చెందిన అధికారి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఏపీకి అలాట్ అయ్యారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు వంటి పలు జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. ఆయా జిల్లాల్లో సింహస్వప్నంగా నిలిచారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. ఎలాంటి ఒత్తిళ్లకు తల వంచకుండా పని చేస్తారని గుర్తింపును తెచ్చుకున్నారు. రిజైన్ కు ముందు ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్) గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన మూడు రోజుల క్రితం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినట్లు వెల్లడించారు. ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతకు ముందు నుంచే ఆయన నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది.
అందుకే రాజీనామా చేశారా?
ప్రభుత్వం మారిన ఏడాదికి, అదీ ఇంకా 20 ఏళ్లు సర్వీసు ఉండగా ఆయన విధుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఐపీఎస్ ఉద్యోగానికి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయడం వెనుక ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఉన్నట్లుగా విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ వేధింపులు, అవమానాలు ఎదుర్కోలేక విసిగిపోయిన సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారని ఏపీకి చెందిన ఓ వర్గం మీడియాలో కూడా వార్త కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
నాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు..
రాజీనామా చేయాలనేది తన వ్యక్తిగత నిర్ణయం సిద్ధార్థ్ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎవరి, ఎలాంటి ఒత్తిళ్లు లేవని తేల్చి చెప్పారు. కుటుంబానికి కొంత సమయాన్ని, ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయ వేధింపులు లేదా.. ఇతరుల బలవంతం కారణంగా ఐపీఎస్ కు రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ వెలువడుతున్న వార్తలను సిద్ధార్థ్ కౌశల్ తోసిపుచ్చారు. అవి ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తనపై వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్.. తన సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు ఈ సందర్భంగా సిద్ధార్థ్ కౌశల్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
కార్పొరేట్ రంగంలోకి?
ఐపీఎస్ విధుల నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న సిద్ధార్థ్ కౌశల్ కార్పొరేట్ సెక్టార్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీలోని ఓ కార్పొరేట్ సంస్థలోకి అడుగు పెడతారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే భవిష్యత్తులో కూడా సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానన్న ఆయన ఏ రంగంలో కొనసాగనున్నారో లేఖలో పేర్కొనలేదు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
……………………………………………………………….