
* సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కామెంట్స్
* నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీ పెద్దలకు ఆని ఆరోపణ
* రైతు భరోసా నాట్ల కోసం కాదు ఓట్ల కోసమని ఎద్దేవా..
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరో సారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనని అందుకే రైతులకు రైతు భరోసా పంపిణీ చేశారు అని విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో రైతు బంధు నాట్ల సమయంలో వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఓట్ల సమయంలో వేస్తోందని ఆరోపించారు.గ్రామాల్లో రైతులు ఎరువులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు 20 నెలలు గడిచినా ఇంకా మరమ్మతు చేయడం లేదని ఆరోపించారు. మేడిగడ్డలో కేవలం రెండుపిల్లర్లే కుంగిపోయాయన్నారు. గత ఏడాది తెలంగాణకు రావాల్సిన 65 టీఎంసీల గోదావరి నీటి అప్పనంగా ఆంధ్రాకు తరలించారు అని హరీష్ రావు ఆరోపించారు. గోదావరి జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు అన్నారు.
……………………………………..