
* ప్రమాదంపై సుదీర్ఘ పరిశీలన
* 44కు చేరిన మృతుల సంఖ్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ(Sigachi Industry) ను ఎన్డీఎంఏ బృందం సందర్శించింది. దాదాపు 4 గంటల పాటు ప్రమాద స్థలాన్ని ఎన్డీఎంఏ (Ndma) అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. ఫ్యాక్టరీలో భారీ పేలుడుకు గల కారణాలను అన్వేషించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను సమర్పించనున్నారు. పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 44 మంది చనిపోయారు. ఇంకా కొందరి ఆచూకీ తెలియలేదు. వారి శరీరాలు కూడా బూడిదలో కలిసిపోయాయా.. ఏమయ్యాయో కూడా తెలియలేదు. ఈ ప్రమాదంతో అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. పేలుడు వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్ట సంభవించింది. దీంతో ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా స్పందించింది. సిగాచి కంపెనీ వద్ద కేంద్రానికి చెందిన నలుగురితో కూడిన నిపుణుల బృందం అధ్యయనం చేపట్టింది. పేలుడు ఘటనపై పరిశీలన జరిపింది. కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా.. లేదా అన్న దానిపై బృందం సభ్యులు విచారణ చేపట్టారు. నిపుణుల కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ నివేదికను తయారు చేసే పనిలో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
………………………………………….