
* జులై 9 న దేశవ్యాప్త ఆందోళనను విజయవంతం చేయాలి
* భారత కమ్యూనిస్ట్ ( మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపు
ఆకేరు న్యూస్ హనుమకొండః ప్రధాని మోదీ , అమిత్ షా ,అంబానీ, అదానీ లు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్ట్ ( మావోయిస్్ట ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ లేఖను విడుదల చేశారు. మోదీ షాల నాయకత్వంలో గత 11 ఏళ్లుగా దేశ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తూ దేశంలోని రైతాంగాన్ని కార్మికులను పేద మధ్య తరగతి ప్రజలను అణచివేతకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా మోదీ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని రైతులు విద్యార్థులు,ఉద్యోగులు, ఇతర సామాజిక వర్గాల వారు ఆందోళనకు సిద్ధమైన నేపధ్యంలో పహల్గాం దాడి జరిగిందని పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తో కేంద్ర పభుత్వం దేశ ప్రజలను దృష్టి మరల్చిందన్నారు. మతోన్మాదం, యుద్దోన్మాదం పేరుతో దేశ ప్రజల మెదళ్లలో విషం నింపుతోందన్నారు. దేశంలోని మొత్తం అటవీ సంపదను అదానీ లాంటి కార్పొరేటర్లకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ఇండియా అమెరికాలు చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని యాపిల్ పంట,పత్తి పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. విద్యుత్ రంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్దమైందని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల మీద ఆర్థిక భారం పడుతోందని దేశంలో నిరుద్యోగం 20 శాతం పెరిగిందని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని.. ఈ నేపధ్యంలో జులై 9న చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనకు అందరూ మద్దతు ఇవ్వాలని లేఖలో కోరారు.
………………………………………………