
* సవాళ్లు-ప్రతి సవాళ్లతో హీటెక్కిన రాజకీయం
* రేవంత్ తోక ముడిచారంటున్న బీఆర్ ఎస్
* పిచ్చిమాటలు మాట్లాడితే తడాఖా చూపిస్తామంటున్న కాంగ్రెస్
* రైతు సంక్షేమం కోసం పాటుపడింది మేమంటే.. మేమంటూ..
* అధికార, విపక్ష పార్టీల మధ్య మాటయుద్దం
* రైతులకు మేలు జరిగేనా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
స్థానిక ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు-ప్రతిసవాళ్లు పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ నీటి చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు రైతు చుట్టూ తిరుగుతున్నాయి. రైతు సంక్షేమం గురించి చర్చించేందుకు తెలంగాణలో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కయ్యానికి కాలు దువ్వారు. 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. టైం నువ్వ్ చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. వేదిక నువ్ చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే అంటూనే టైం, వేదిక రెండూ ఆయనే ఫిక్స్ చేసేశారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని ప్రకటించి, ఠంచనుగా ఆరోజున బీఆర్ ఎస్ శ్రేణులతో అక్కడకు చేరుకున్నారు.
ఖాతరు చేయని రేవంత్
కేటీఆర్ సవాల్ ను కానీ, ఆయన వ్యాఖ్యలను కానీ పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిపోయారు. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చెప్పినట్లుగా ఈనెల 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చిన కేటీఆర్.. రేవంత్ పై విరుచుకుపడ్డారు. తోక ముడుచుకుని ఢిల్లీ పారిపోయారంటూ విమర్శలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై చర్చించే దమ్ము, ధైర్యం ఆ పార్టీక లేదని, వారు ప్రజలకు చేసింది ఏమీ లేకే రాలేకపోయారని అన్నారు. తాము నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే రేవంత్ నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని, ఇప్పుడు నిధులు ఇచ్చేందుకే అక్కడకు వెళ్లారని ఆరోపించారు.
మమ్మల్ని ఒక మాట అంటే మేము పది..
దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగానే స్పందించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే ఆయనపై విరుచుకుపడ్డారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. “మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఆయనకు ఎలా తెలుస్తాయి?” అని జగ్గారెడ్డి నిలదీశారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలను “గాడిదలు” అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. “మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే, మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం” అని స్పష్టం చేశారు. “బీఆర్ఎస్ పార్టీని మీ నలుగురు తప్ప.. ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. కేసీఆర్‌కి రావడం చేతకాక బచ్చగాడిని పంపుతారా. మాకు సానుభూతి ఉంది కాబట్టే హాస్పిటల్‌కి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శిస్తున్నాం. బావ, బామ్మర్ధులతో పాటు చెల్లి ఇప్పుడు పోటీలోకి వచ్చింది. అందరూ కలిసినా రేవంత్‌ని ఏం చేయలేకపోయారు. పిచ్చిమాటలు మాట్లాడితే మా తడాఖా చూపిస్తాం. మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చేవి’ అంటూ అద్దంకి దయాకర్ కూడా విరుచుకుపడ్డారు.
రైతులకు మేలు జరిగేనా?
రైతుల పేరు చెప్పి అధికార, విపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తుంటే, మరోవైపు రాష్ట్రంలో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు అష్టకష్ఠాలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులు పెట్టీ ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు ఎరువల కోసం యుద్ధాలు చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో రైతు రాజ్యం నడిచిందని, రైతుకు చిన్న కష్టం కూడా రాకుండా ఆయన చూసుకున్నారని బీఆర్ ఎస్ ప్రచారం చేస్తోంది. గత పాలకులు చేసిన పాపాలే ప్రస్తుతం రైతులకు ఇబ్బందిగా మారాయని కాంగ్రెస్ అంటోంది. యూరియా కోసమే రేవంత్ ఢిల్లీకి వెళ్లారని, సరిపడా యూరియాను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇరు పార్టీల వాదోపవాదాలు ఎలాగున్నా, ఈ రాజకీయాలు రైతుల పాలిట శాపంగా మారతాయా? మేలు జరిగేనా అనేది వేచి చూడాలి.
……………………………………………………………