
* భద్రాచలం వద్ద పెరిగిన నీటి మట్టం
* టేకుల గూడెం వంతెన మూసివేత
* అప్రమత్తమయిన అధికారులు
* రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ప్రమాదసూచికను ఎగురవేసిన అధికారులు
ఆకేరు న్యూస్, ములుగు: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం
పెరుగుతోంది. ప్రస్తుతం 40.7 అడుగులకు నీటి మట్టం చేరింది. ఈ నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం 20 అడుగులు ఉన్న నీటి మట్టం శనివారానికి 40.7 అడుగులకు చేరింది. పర్ణశాల వద్ద గోదావరి మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిందని అధికారులు చెప్తున్నారు. గోదావరి ఉధృతి మరింతగా పెరిగితే సమీప గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది, గోదావరి ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లాలోని గోదావరి నది పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ చత్తీస్ ఘడ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163 పై పేరూరు పరిధిలోని టేకులగూడెం శివారులో గల రేగుమాగు వంతెనపై రాకపోకలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వంతెన ముఖ ద్వారం వద్ద బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోవాలని సూచించారు.రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద ప్రమాద సూచిక ఎగురవేశారు.
……………………………………….