
* సమ్మక్క సారలమ్మ గణకీర్తి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఏర్పాటు
* జాతర వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం
* రాష్ట్ర మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: వచ్చే ఏడాది జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని, ఆదివాసి సాంప్రదాయాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్ లతో కలిసి ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గణ కీర్తిలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. వేల సంవత్సరాల పాటు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఇప్పటికే జాతరలో శ్వాశత పనులు జరుగుతుండగా మరో 112 కోట్ల రూపాయలతో సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వానికి అంచనాలు తయారు చేసి నివేదిక సమర్పించడం జరిగిందని అన్నారు. మేడారం మహా జాతరను విజయవంతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, జాతరకు కావలసిన నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్యూ లైన్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, జాతర విజయవంతానికి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు. జంపన్న వాగుపై ఇరువైపులా భక్తులు సేద తీరడానికి అహాలదకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గిరిజన పూజారుల సాంప్రదాయానికి విగాధ కలగకుండా పూజార్ల ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఈ ఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….