
ఆకేరు న్యూస్, జనగామ:పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న ఆదికవి పాల్కురికి సోమనాథుడు స్మృతి వనం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అధ్వానంగా మారిందని, దీన్ని వెంటనే అభివృద్ధి చేసి ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావాలని బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ నాయకుల బృందం స్మృతి వనాన్ని సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు కమ్మగాని శ్రీకాంత్, దుంపల సంపత్, మారం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 80 లక్షల ఖర్చుతో నిర్మించిన ఈ స్మృతి వనం ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరిట ఒక గర్వకారణంగా ఉండాలి. కానీ, ప్రారంభించిన తరువాత దాని పై ఎటువంటి పరిరక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు, పశువుల సంచారానికి కేంద్రంగా మారింది. ఇది అత్యంత బాధాకరం. అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు స్మృతి వనాన్ని సందర్శించే సమయంలో అక్కడ కనిపించే మందు సీసాలు, సిగరెట్ డబ్బాలు, పగిలిన ప్లాస్టిక్ కప్పులు, పేడను చూసి తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇది ఆదికవి గౌరవానికి తూట్లు పొడిచే పరిస్థితి అని అన్నారు. పాల్కురికి సోమనాథుడు లాంటి మహాకవి గుర్తింపును సద్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం విచారకరం. వెంటనే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలి, అని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు పబ్బా సంతోష్, మచ్చ సునీల్, కేరళ కర్ణాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………….