
– ఉజ్జయినీ మహాకాళి బోనాలు ఆరంభం
– భారీ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
– ఘనమైన చరిత్ర ఆ ఆలయం సొంతం
– అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలతో నేడు లష్కర్ దద్ధరిల్లనుంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆది, సోమవారం రోజుల్లో జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంతోపాటు సికింద్రాబాద్‌లోని ఇతర అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను కనుల పండువగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజుల పాటు బోనాల జాతరలో భాగంగా ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ, సోమవారం భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. కాగా, ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉజ్జయినీ మహాకాళి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి
మొక్కులు తీర్చుకోనున్నారు. ఇదిలాఉండగా ఉజ్జయినీ మహాకాళికి ఘనమైన చరిత్ర ఉంది.
కలరా నుంచి కాపాడాలని..
1813వ సంవత్సరంలో మిలిటరీలో పని చేసే సికింద్రాబాద్ వాస్తవ్యులు సురిటి అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయిన కొద్ది రోజులకే ఉజ్జయినీలో కలరా వ్యాధి ప్రబలి వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో సురిటి అప్పయ్య, ఆయన అనుచరులు ఉజ్జయినీలో మహాకాళి దేవిని దర్శించుకుని, కలరా వ్యాధి నుంచి ప్రజలను కాపాడాలని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత సికింద్రాబాద్‌లో శ్రీ మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తామని మొక్కుకున్నారు. వెంటనే కలరా వ్యాధి మాయమైంది. అనంతరం సురిటి అప్పయ్య, వారి అనుచరులు సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చి 1815వ సంవత్సరంలో (ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట) కట్టెతో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి, నిత్యపూజలు ప్రారంభించారు. శ్రీ అమ్మవారికి శ్రీ ఉజ్జయినీ మహాకాళి అని నామకరణం చేశారు.
బాలిక రూపంలో కలలోకి వచ్చి..
పూర్వం ఈ ప్రాంతం చెట్లు, చేమలు, కొండరాయి తదితర వాటితో నిండిపోయి ఉండేది, ఆలయం పక్కన ఒక పెద్ద బావి ఉండేది, దానికి మరమ్మతులు చేసే సమయంలో తవ్వకాల్లో శ్రీమాణిక్యాలదేవి విగ్రహం లభించింది. శ్రీ అమ్మవారు 8 సంవత్సరాల బాలిక కలలో వచ్చి తన అక్క అనగా శ్రీమహాకాళి అమ్మవారి పక్కన ప్రతిష్టాపన చేయాలని కోరగా, ఆ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ప్రచారంలో ఉంది. కాగా 18564లో సురిటి అప్పయ్య కట్టె విగ్రహం స్థానంలో ఇప్పుడున్న మహాకాళి, మాణిక్యాలమ్మ అమ్మవార్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసి ఆలయ నిర్మాణం చేశారు.
1953లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి..
కొద్ది సంవత్సరాల క్రితం సురిటి కృష్ణ గతించడంతో వారు కుమారులు సురిటి రామేశ్వర్, సురిటి కామేశ్వర్ బోనాల జాతరలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా 1953వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుని, భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేస్తూ, సేవలు అందిస్తోంది. ఆ నాటి నుంచి ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి ఆదివారం ఘటోత్సవం, ఘటం ఊరేగింపు పదిహేను రోజులు జరుగుతూ, మూడో ఆదివారం బోనాలు, మహారతి సమర్పణ, సోమవారం రోజు రంగం-భవిష్యవాణి, శ్రీఅమ్మవారి గజాధిరోహణ ఊరేగింపు, సాగనంపు సేవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.
………………………………………………………..