
– విలక్షణ నటనకు ప్రతిరూపం కోట
– లెజండరీ నటుడిగా గుర్తింపు
– 750 సినిమాలకుపైగా సుదీర్ఘ సినీ ప్రస్థానం ఆయన సొంతం
– పాత్ర ఏదైనా నటనతో జీవం పోసిన నటుడు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ప్రతినాయకుడు.., క్యారెక్టర్ యాక్టర్.., సహాయ నటుడు.., కామెడీ.. ఇలా ఏ పాత్ర పోషించినా తన నటనతో మెప్పించి, “ఈ డెవడ్రా బాబూ..!(ప్రజాదరణ పొందిన కోటా డైలాగు)” ఏం నటనరా అని సినీ ప్రేమికుల మన్ననలు పొందిన మహా నటుడు కోట శ్రీనివాసరావు. పిసినారి లక్ష్మీపతి పాత్రలో అహ నా పెళ్లంట సినిమాలో ఆయన జీవించారు. కోటా సినీ కెరీర్ లో ఆ పాత్ర ఓ మైలురాయి. తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు. చిన్న తలకట్టు, ముతక పంచె, చిరిగిన బనియన్, పగిలిన కళ్లద్దాలతో ఆయన నటించిన తీరు అహా.. సినీ ప్రేమికులకు నవ్వుల పండగే. బాబు మోహన్ తో కలసి కోట శ్రీనివాసరావు దాదాపు 60 చిత్రాల్లో నటించారు. బాబూ మోహన్‌తో మామగారు సినిమాలో వారిద్దరు చేసిన హాస్యం ఇప్పటికీ టీవీల్లో వస్తూనే ఉంటుంది. చాలా సినిమాల్లో వారిద్దరి మధ్య ఉన్న హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రగా చేసిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆయన విలన్ పాత్ర వేశారంటే అందులో రౌద్రం.. హీరోలను సైతం భయపెట్టేలా ఉంటుంది. మధ్యతరగతి తండ్రిగా, అవినీతి కి కేరాఫ్ అడ్రస్‌గా, కామెడీ విలన్ గా పలు రకాల పాత్రలతో ఆయన రక్తికట్టించారు. ‘సాంబశివుడురా నా పేరు’ అంటూ క్రూరమైన విలన్‌గా గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు రోల్లో అందరికీ వణుకు పుట్టించారు. అవినీతి ఆరోగ్య మంత్రిగా ఆయన ఎక్స్ప్రెషన్స్ నభూతో నభవిష్యత్. అలాగే ప్రతిఘటన సినిమాలో కూష్మాండం బద్దలవుతుందనే డైలాగ్ ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోరు.
గదైతే నేను ఖండిస్తున్న..
1978లో ప్రాణం ఖరీదు సినిమాతో కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ డెవడ్రా బాబూ… నాకేంటి ..మరి నాకేంటి., మరదేనమ్మా నా స్పెషల్.., అయ్య నరకాసుర… వంటి డైలాగులను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోరు. ఆర్జీవీ ‘గాయం’ సినిమాలో ‘గదైతే నేను ఖండిస్తున్న’ అంటూ గురునారాయణ్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే. ప్రతి ఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు లభించింది. అహ నా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడుగా కొనసాగారు. కోటా, బాబుమోహన్ జంట అంటే సినిమా హిట్టే అనే టాక్ ఉండేది. 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్న నాటి నుంచీ నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు బ్యాంకు ఉద్యోగి. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు. ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
తెలుగులోనే కాదు..
తెలుగులోనే కాదు.. , హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో కోట నటించారు. వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ SIIMA అవార్డును అందుకున్నారు. 2015లో అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. S/O సత్యమూర్తి (2015), అత్తారింటికి దారేది (2013), రక్త చరిత్ర (2010), లీడర్ (2010), రెడీ (2008), పెళ్లైన కొత్తలో (2006), సర్కార్ (2006) వంటి చిత్రాల్లో నటకకు విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. సినీ రంగంలోనే కాదు. రాజకీయం రంగంలోనూ ఆయన ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగానూ ఆయన సేవలు అందించారు. శాసనసభా నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
…………………………………………………….