
* తెలంగాణలో రైతుల గగ్గోలు
* రోజులు గడుస్తున్నా తీరని వ్యథ
* వరినాట్లు మొదలైనా అందని యూరియా
* పనులు మానుకుని పంపిణీ కేంద్రాల వద్దే పడిగాపులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : రైతుల సంక్షేమంపై సవాళ్లు – ప్రతిసవాళ్లు చేసుకుంటున్న అధికార, విపక్ష పార్టీల నేతలు వారి సమస్యలు తీర్చడంపై సీరియస్ గా దృష్టి కేంద్రీకరించడం లేదు. ఫలితంగా అన్నదాతలకు ఆక్రందనలు తప్పడం లేదు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. రోజుల తరబడి కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే లేచి పొలాలకు వెళ్లే రైతులు.. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చెప్పులను వరుసలో పెట్టి మరీ ఎదురుచూపులతో అక్కడే కాలం గడుపుతున్నారు. ఓపిక పట్టలేని అన్నదాతలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా గాంధారి వంటి ప్రాంతాల్లో ఆందోళనలు కూడా చేపట్టారు.
వరంగల్ జిల్లా పరకాలలోనూ..
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో యూరియా కొరత వేధిస్తోంది. నారాయణపేట్ మక్తల్ ఏకంగా వారం రోజులుగా యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్దే రైతులు ఉంటున్నారు. తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. పీసీఎస్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. వరినాట్లు మొదలైనా సహకార సంఘాల్లో సరిపడా యూరియా నిల్వలు లేకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. తెల్లవారుజామునే 3.30కు అయిపోతున్నాయని వాపోతున్నారు. దొరికినా రైతుకు రెండు బస్తాలే ఇస్తున్నారని తెలుపుతున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. అటు పనులు చేసుకోలేకపోతున్నామని, ఇక్కడ పడిగాపులు కాసినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఊరికి ఆ ఊరికి సరిపడా యూరియాను ఎందుకు పంపడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విమర్శలకే పరిమితం
సరిపడా ఎరువులను అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే, బాధ్యతను మరిచి కేంద్రంపై నెపం వేస్తోందని విపక్ష పార్టీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల కొరత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాను కేంద్రం విడుదల చేయడం లేదని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తద్వారా ఎరువుల కొరతలో తమ వైఫల్యం ఏమీలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
రేవంత్ విఫలం
తెలంగాణలో యూరియా కొరతపై రేవంత్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలకు దిగారు. రైతులకు తగినంత యూరియా సరఫరాను నిర్ధారించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మధ్యవర్తులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత లభిస్తోందని ఆయన ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను న్యూఢిల్లీలో కలిసిన తర్వాత కూడా తెలంగాణ రైతులకు తగినంత యూరియా సరఫరా చేయడంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బిఆర్ఎస్ నాయకుడు డిఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు చేపట్టిన నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు.
…………………………………..