
* దంచి కొడుతున్న వాన
* అవసరమైతే తప్ప బయటకు రావొద్దు
* ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా మేఘావృతమై మధ్యాహ్నం 3 తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షసూచన వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈరోజు, రేపు పలుజిల్లాల్లో ఉరుములతో కూడిన వాన పడుతుందని హెచ్చరించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని ఈరోజు ఉదయమే హెచ్చరించింది. వరంగల్(Warangal), మహబూబ్నగర్ జిల్లాలకూ వర్షసూచన తెలిపింది. చెప్పినట్లుగానే హైదరాబాద్లో భారీ వాన ప్రారంభమైంది. సికింద్రాబాద్, చిలకలగూడ, కృష్నానగర్, కూకట్పల్లి, అల్వాల్, బేగంపేట, తిరుమలగిరి, బొల్లారం, బోయినపల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వరద పోటెత్తుతోంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నగరవాసులు వానకు తడిసి ముద్దయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు అని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.
…………………………………………….