
* తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చితేనే సాధ్యం
* మోదీ తలచుకుంటే గంటలో బిల్ పాస్
* మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి డ్రామాలు చేసినంత మాత్రాన బీసీ బిల్లు ఆమోదం పొందదని బీఆర్ ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ధర్నాలు,ఆందోళనలు చేసినంత మాత్రాన బీసీ బిల్లు చట్టరూపం ధరించదని వినోద్ అన్నారు. బీసీ బిల్లు ఆమోదంపై ఢిల్లీలో ఆందోళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపధ్యంలో వినోద్ కుమార్ ఈ విమర్శలు చేశారు. మోదీ తలుచుకుంటే ఒక గంటలో బీసీ బిల్ పార్టమెంట్ లో పాస్ అవుతుందని అన్నారు. 50 శాతం కు మించి బీసీలకు రిజర్వేషన్లు ఉండరాదని గతంలో ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చనిదే రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదన్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో మోదీకి చిత్త శుద్ధి లేదని వినోద్ విమర్శించారు.గతంలోనే బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు.బీసీలకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు కల్పించారని అన్నారు.అడ్వొకేట్ జనరల్ పదవిని బీసీ లకు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ,లీగల్ సెల్ ప్రతినిధులు జక్కుల లక్ష్మణ్ ,సి .కళ్యాణ్ రావు ,హరీష్ ,కావ్యశ్రీ పాల్గొన్నారు.
………………………………………………….