*గ్యాస్ వినియోగదారులకు తప్పని తిప్పలు..
*సరఫరాలో జాప్యం, ఆగని అక్రమాలు
ఆకేరు న్యూస్, డెస్క్:
హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గతంలో బుకింగ్ చేసుకున్న మూడు నాలుగు రోజుల్లోనే ఇంటికి వచ్చే సిలిండర్, ఇప్పుడు బుకింగ్ కావడానికే వినియోగదారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఫోన్ ద్వారా బుకింగ్ చేసినా కన్ఫర్మేషన్ మెసేజ్ రాకపోవడం, ఏజెన్సీల చుట్టూ తిరిగినా సరైన సమాధానం లభించకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం గ్యాస్ డీలర్ల వద్ద బుకింగ్ ఆప్షన్ తొలగించడం మరియు సాంకేతిక సమస్యలని డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇ-కెవైసి (e-KYC) పూర్తి చేయని వారికి బుకింగ్ ప్రక్రియ నిలిచిపోతుండటం గమనార్హం.
మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 30 రోజులు మరియు సింగిల్ సిలిండర్ ఉన్నవారు 21 రోజుల వ్యవధి తర్వాతే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, గడువు తీరకముందే బుకింగ్ చేసుకోవడం సాధ్యపడటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు గ్యాస్ కంపెనీలకు ముందస్తుగా లక్షల్లో నగదు చెల్లిస్తేనే స్టాక్ సరఫరా అవుతోందని, నగదు చెల్లింపులో జాప్యం వల్ల కూడా సిలిండర్ల పంపిణీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కొందరు వ్యాపారులు మరియు డీలర్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. గృహ అవసరాల కోసం కేటాయించిన సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపార సంస్థలకు రూ. 500 నుండి రూ. 600 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు డీలర్లు కావాలనే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్‌ను మళ్లిస్తున్నట్లు సమాచారం. చిన్న కుటుంబాలు మరియు వలస కార్మికులు వాడే 5 కిలోల సిలిండర్ల ధరలను సైతం రెట్టింపు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి, తనిఖీలను ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. గ్యాస్ అక్రమ వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు, సామాన్యులకు సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
