
* నమ్రత గలీజు “సృష్టి”కి.. ఎందరో తల్లులకు సంకట స్థితి
* పోలీసులను ఆశ్రయిస్తున్న నమ్రత బాధితులు?
* వన్ ప్లస్ వన్ ఆఫర్లలో పిల్లల విక్రయాలు
* వెలుగులోకి డాక్టర్ నమ్రత లీలలు
* ఇతర రాష్ట్రాలలోనూ బాధితులు
* ఆరా తీస్తున్న పోలీసులు
* తెలంగాణలో 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు
* తనిఖీలకు సిద్ధమవుతున్న ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
పవిత్రమైన డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ.. ఛీటర్ గా మారిన నమ్రత గలీజు సృష్టి.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఆమె సృష్టి సెంటర్ బాధితులుగా ఉన్నారు. ఈక్రమంలోనే చాలా మంది పోలీసులను ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని ఆమె ఫెర్టిలిటీ సెంటర్ల ద్వారా పిల్లలు లేని దంపతులు ఎందరో చికిత్స పొందారు. నాలుగేళ్ల క్రితమే ఆస్పత్రి లీలలు బయటపడడంతో సికింద్రాబాద్లోని కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ గుట్టుగా ఏళ్ల తరబడి దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతో మంది దంపతులు ఆమె వద్ద చికిత్స పొందారు. తాజాగా రాజస్థాన్ దంపతుల ఇష్యూ వెలుగులోకి రావడంతో మిగతా వారిలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. తమ అండాలు, వీర్యకణాలతోనే ఐవీఎఫ్ విధానంలో బిడ్డలను కన్నామని ధీమాలో ఎందరో తల్లులు ఉన్నారు. ఆ సెంటర్ లీలలు బయటపడడంతో అక్కడ చికిత్స పొందిన వారిలో ఎంత మంది సొంత డీఎన్ ఏతో పిల్లలు ఉన్నారా, కొని కట్టబెట్టారా అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ పిల్లలు.. వారి పిల్లలేనా?
డాక్టర్ నమ్రత చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంగా నడిచిన దందాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణ, ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడల్లో కూడా విచారణలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లోని మిషనరీ.., చికిత్సా విధానాలను కూడా పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆ పిల్లలు.. వారి పిల్లలేనా.? కొని అప్పగించేరా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో ఆమె వద్ద చికిత్స పొందిన వారిలో కొందరు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. మరికొందరు తమకు సక్రమంగానే చికిత్స జరిగిందని పేర్కొంటున్నట్లు తెలిసింది.
వన్ ప్లస్ వన్ ఆఫర్
డాక్టర్ నమత్ర తమ వద్ద చికిత్స తీసుకునే వారికి కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. తమ వద్ద ఒక పిల్లోడికి చికిత్స తీసుకుంటే.. మరొకరిని ఫ్రీ గా అందిస్తామని సోషల్ మీడియాలో ప్రచారాలూ చేపట్టారు. ఈక్రమంలో ఆస్పత్రికి అనుమతి ఉందా లేదా అని పరిశీలించకుండానే చాలా మంది సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని ఆశ్రయించారు. ఇదే అదునుగా తమ దగ్గరకు వచ్చిన వారి నుంచి రూ.30 లక్షలకుపైగానే డాక్టర్ నమ్రత వసూలు చేసేవారు. ఇవి కాకుండా స్కానింగ్, టెస్టులు అంటూ వేలాది రూపాయలు తీసుకునేవారు. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
దాడులకు సిద్ధం
డాక్టర్ నమ్రత వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో మొత్తం 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేని, లైసెన్స్ గడువు ముగిసిన కేంద్రాలపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. సృష్టి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నామని ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కమిషనర్ వెల్లడించారు. అన్నిచోట్లా తనిఖీలు చేయాలని డీఎంహెచ్ ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇల్లీగల్ సెంటర్లపై ఫోకస్ పెట్టామన్నారు. మరోవైపు విశాఖ ఐవీఎఫ్కేంద్రాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
……………………………………………