ఆకేరు న్యూస్, వరంగల్ : ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వరంగల్ విద్యార్థి ఆచూకీ మిస్టరీగా మారింది. బిడ్డ ఎక్కడున్నాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హనుమకొండ నయీంనగర్కు చెందిన చింతకింది రూపేశ్ చంద్ర (26) అమెరికాలోని కాంకార్డియా వర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. రూపేశ్తో ఈ నెల 2న చివరిగా కుటుంబసభ్యులు మాట్లాడాడు. మరుసటి రోజు ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు రోజులు వేరే స్నేహితుడి వద్దకు వెళ్తానని రూపేశ్ చెప్పినట్లు అతని రూమ్మేట్స్ చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో అమెరికాలోని తానా సభ్యుల సహకారంతో కుటుంబసభ్యులు షికాగో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, సాయం కోరుతూ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా లేఖ రాశారు. రూపేష్ తండ్రి సదానందం మెకానిక్. రెండో కుమారుడైన రూపేశ్ ఎంఎస్ చేసేందుకు 2019లో లండన్ వెళ్లాడు. 2022లో స్వదేశానికి వచ్చిన రూపేశ్ డబుల్ ఎంఎస్ చేసేందుకు 2023 డిసెంబర్ లో మరోసారి అమెరికా వెళ్లాడు. మే2 నుంచి రూపేశ్ ఆచూకీ కోసం ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నామని షికాగోలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి పోలీసులు వేర్వేరు ప్రకటనలు చేశారు.
——————–