* కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, సిద్దిపేట : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే.., లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత బెయిలు కోసం వారు అమ్ముడుపోతారని మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కొండా సురేఖ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన లిక్కర్ స్కాం వల్లే ఎంతో మంది తాగుబోతులు తయారు అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని తెలిపారు. పదేళ్లలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని టీఆర్ఎస్ పార్టీకి ఐదు నెలలో కాంగ్రెస్ పార్టీ 2500 ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. హరీష్ రావు అంత మంచిగా అభివృద్ధి చేస్తే సిద్దిపేట ప్రచారానికి కేసీఆర్ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని.. మళ్ళీ మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ ఎంపీలను గెలిపిస్తే వారిని బీజేపీకి ఆమ్ముకుంటుందని విమర్శించారు. ‘‘మీకు స్వాతంత్య్రం వచ్చింది మీరు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు. వడ్డెర కులస్థులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
—————————