* పెళ్లయి పిల్లలున్నారని చెప్పినా..
* ప్రేమించాలంటూ వేధించేవారొకరు
* ఫొటోలు తీసి మార్ఫింగ్ చేసి..
* బాలికను ప్రేమపేరుతో వేధిస్తున్నది మరొకరు..
* మహిళలపట్ల ఆగని ఆకతాయిల అరాచకాలు
* మాకు చెప్పండి భరతం పడతాం అంటున్న షీటీమ్స్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళను తనతో పాటు పనిచేసే వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు. తనకు పెళ్లైందని, పిల్లలు ఉన్నారని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేని మహిళ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. డెకాయ్ ఆపరేషన్ చేసిన పోలీసులు నిందితుని ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.
ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి..
ఇంటర్ చదివే బాలికతో సమీపంలోని ఇంట్లో ఉండే వ్యక్తి పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని అడ్డంపెట్టుకొని ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండే సమయంలో వచ్చి మాటలు కలిపేవాడు. కొద్దిరోజులకు నంబర్ తీసుకున్నాడు. బాలిక పొటోలను తీసుకొని వాటిని మార్ఫింగ్ చేశాడు. వాటిని బాలికకు పంపుతూ.. తనను ప్రేమించాలని లేదంటే ఈ ఫొటోలు పెటి అందరికీ పంపుతాను అంటూ వేధించడం ప్రారంభించాడు. దాంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన షీటీమ్స్ పోకిరీ ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.
ఆగని ఆరాచకాలు..
కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. రోజు రోజుకూ మహిళలపై అరాచకాలు, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా.. ఎంతమంది పోకిరీల భరతం పడుతున్నా వేధింపులు తగ్గడంలేదు. అరాచకాలు ఆగడంలేదు.
మేమున్నాం అంటూ
బాధిత మహిళల నుంచి ఫిర్యాదు అందుకుంటున్న షీటీమ్స్.. మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తున్నారు. పోకిరీల భరతంపట్టి కటకటాల్లోకి పంపిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో 15 రోజుల్లోనే బాధిత మహిళల నుంచి 205 ఫిర్యాదులు అందాయి. కాగా.. వాటిలో 152 మంది పోకిరీల భరతం పట్టి కోర్టు బోనులో నిలబెట్టారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిన పోకిరీలకు వార్నింగ్‌లు ఇచ్చి వదిలేశారు. పట్టుకున్న పోకిరీల్లో 79 మంది మైనర్ పోకిరీలు ఉండగా.. 73 మంది మేజర్లు ఉన్నారని డీసీపీ ఉషారాణి తెలిపారు. బాధిత మహిళలను ఫోన్లో వేధించిన కేసులు 33, సోషల్ మీడియా ద్వారా వేధించిన వారు-78, నేరుగా వేధించిన వారు 94. బాధిత మహిళలకు రాచకొండ పోలీసులు 24/7 షీటీమ్స్ బృందాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మహిళలు, చిన్నారులను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటాన్నారు. బాధిత మహిళలు వెంటనే రాచకొండ వాట్సాప్ నెంబర్- 8712662111లో సంప్రదించాలని డీసీపీ సూచించారు.
