* హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు
ఆకేరు న్యూస్ డెస్క్ : శబరిమల పర్యటకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ కు ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేరళ(Kerala)కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆమె ఆయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారు. ఈమేరకు కొచ్చిలోని ప్రమదం స్టేడియానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అయితే, హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో హెలికాప్టర్‌ను అతి కష్టం మీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఈ అనూహ్య ఘటనతో షెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. తిరిగి వెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిసింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
