దోపిడీ పాలనలో రాష్ట్రం దివాళా
* మాజీ సీఎం కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థి అయిన రౌడీ షీటర్ను చిత్తుగా ఓడించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు లక్ష్యంగా, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన, ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పోటీలో ఉన్న అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా, ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు…హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి. జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేత కు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, అధినేత కేసీఆర్ గారు సమావేశంలో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
