భారీగా ప్రాణనష్టం!
ఆకేరు న్యూస్, కాకినాడ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలోని ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో తయారీ కేంద్రంలో సుమారు 30 నుండి 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, మృతదేహాలు ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం… ప్రాథమికంగా 6 నుండి 18 మంది వరకు మరణించినట్లు వివిధ కథనాలు వస్తుండగా, ఈ సంఖ్య 20కి పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు కార్మికులు తీవ్ర గాయాలపాలవగా, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సహాయక చర్యలు – ప్రభుత్వ స్పందన:
ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం, వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు ఇంకా అధికారికంగా పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
