* 20 మంది సజీవ దహనం
* నాలుగు ఫైరింజన్లతో మంటలు అదుపు
* ప్రయాణికుల సమాచారానికి హెల్ఫ్‌లైన్ ఏర్పాటు
* బాధ్యులపై కేసులు నమోదు : మంత్రి పొన్నం ప్రభాకర్
* రూ. ఐదు లక్షల ఎక్ష్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
* కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం
* ప్రయాణికుల్లో ఎక్కువ హైదరాబాద్ వారే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కావేరి బస్సు కాలి బుడిదైంది. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ DD01N9490 బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి 44 మంది ప్రయాణికులతో కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు బస్సు బెంగళూరుకు బయలు దేరింది. కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకేశారు. 20 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచానా వేశారు. పూర్తిగా కాలి బూడిదైన మృతదేహాలను గుర్తించేందుకు డీఏన్ ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు.
బస్సు బయలు దేరింది ఇలా..
పటాన్ చెరువులోని ప్రధాన ఆఫీసు నుంచి గురువారం రాత్రి 9గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు బయలుదేరింది. శుక్రవారం వేకువ జాము సుమారు రెండున్నర తరువాత కల్లూరు మండలం చిన్నటేకూరు రాగానే ప్రమాదం సంభవించింది. ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు కిందకు దూరిపోయింది. ఈ క్రమంలో బైకు పెట్రోల్ లీక్ అయి అవడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటూ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు అంచనా వేశారు. 2025 మార్చి 31 వరకు మాత్రమే బస్సు ఫిట్నెస్ ఉన్నట్లు తెలిసింది.
ప్రయాణికుల మాటల్లో..ప్రమాద వివరాలు..
నిజాంపేట్ క్రాస్ రోడ్లో బస్సు ఎక్కిన శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెల్లూరు జిల్లాకు చెందిన అతను ఇటీవల ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్తున్నాడు. ప్రస్తుతం అతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెస్ రామారెడ్డి.. తన బావ దగ్గరికి వచ్చి తిరిగి బెంగుళూరులోని తన భార్య, కూతురు వద్దకు వెళ్తున్నాడు. జెఎన్టీయూలో బస్సు ఎక్కిన అతను.. ప్రమాదంలో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతను బస్సు చివరలో ఉండడంతో ప్రమాదం జరగ్గానే బయటి నుంచి కొందరు డోర్ గట్టిగా కొట్టారు. దీంతో ఉలిక్కిపడి పైకి లేచిన అతన్ని.. బయటికి నుంచి కొందరు కిందకు లాగేశారు. ఇతడితో పాటూ వేణుగోపాల్ రెడ్డి, సుబ్రమణ్యం అనే ఇద్దరు కూడా బయటపడ్డాడు. వీరిలో సుబ్రహ్మణ్యం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్వల్ప గాయాలతో బయటపడ్డ వారు..
ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు సీట్ నెంబర్ U4లో ఉన్న సురారానికి చెందిన గుణ సాయి, సీట్ నెంబర్ U18లో ఉన్న బహుదూర్ పల్లికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. వీరిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యానగర్ ప్రాంతానికి చెందిన జయంత్ అనే వ్యక్తి బస్సులో నుండి దూకేశాడు. ఈ ఘటనలో అతడి ఎడమ కాలికి స్వల్ప గాయాలయ్యాయి.
బయటపడ్డ తెలంగాణ వారు వీరే..
కర్నూలు బస్సు ప్రమాదం నుంచి బయటపడిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. సత్యనారాయణ (ఖమ్మం), జయసూర్య (మియాపూర్), నవీన్ (హైదరాబాద్), అశోక్ (మాడుగుల), కీర్తి (ఎస్ఆర్ నగర్), గుణసాయి (హైదరాబాద్), గ్లోరా ఎల్సా (హైదరాబాద్) ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ప్రాణాలను దక్కించుకున్నారు.
స్థానికులు స్పందించడంతో..
బస్సు ప్రమాదంలో స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగ్గానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించింది. వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తంచారు. అన్ని విభాగాలనూ అలెర్ట్ చేయగలిగారు. అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకుని కర్నూలులోని ఆస్పత్రికి చేర్చారు. ఇలా చాలా మంది వెంటనే స్పందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సాయం పడ్డారు.
హత్య నేరం కింద జైలుకు : మంత్రి పొన్నం ప్రభాకర్
హత్య నేరం కింద జైలుకు పంపిస్తామని ప్రయివేటు బస్సు యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఎక్ష్ గ్రేషియా అందిస్తోందని చెప్పారు. కుటంబ సభ్యులను పూర్తిగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ప్రయివేటు బస్సుల్లో రక్షణ శూన్యం..
ప్రయివేటు బస్సుల్లో రక్షణ శూన్యంగా మారుతోంది. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ అసలే కానరావు. ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయించి.. తిప్పుతారు. అనుభవం లేని డ్రైవర్లు. స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్డగోలుగా దోచుకుంటారు. తాజాగా కర్నూలు జరిగిన ప్రైవేటు బస్సు కాలిబూడిదైన ఘటన దీనికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. హైదరాబాద్, బెంగళూరు మధ్య నడుస్తున్న ఓల్వో స్లీపర్ బస్సు (DD01N9490) కావేరి ట్రావెల్స్ పేరుతో వేమూరి వినోద్ కుమార్ వ్యక్తి నడుపుతున్నారు. దీనిని డయ్యూ డామన్‌లో రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత ఒడిశాలోని రాయగడ ఆర్టీవోకి బదిలీ చేసి ఆల్ఇండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పొందారు. నడిపేది మాత్రం బెంగళూరు, హైదరాబాద్ మార్గంలో. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎక్కడో రిజిస్టర్ చేయడం, మరెక్కడో నడపడం అనేది పెద్ద దందా!. రవాణా శాఖ కళ్లు మూసుకున్నంత కాలం ఇవి ఇలాగే జరుగుతుంటాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
………………………………………………..
