* కంపెనీ ట్రిప్పునకు వెళ్లి.. వస్తుండగా ఘోరం
* ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
ఆకేరు న్యూస్, కర్నూలు : కర్నూలు జిల్లా శివారులో జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ప్రమాదం తాలూకు విషాదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. 19 మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనమయ్యారు. మరి కొంత మంది ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బస్సు అద్దాలు పగలగొట్టి ప్రమాదం నుండి బయటపడ్డారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇటీవల, రమేష్ తన కుటుంబంతో హైదరాబాద్ కు కంపెనీ ట్రిప్పులో భాగంగా వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం వారిని బలి తీసుకుంది. మొత్తం ఫ్యామిలీ మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
