* పెద్దోళ్లకు ఒక న్యాయం.. పేదోళ్లకు ఒక న్యాయం పేరుతో..
* తెలంగాణభవన్‌లో బీఆర్ ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా పనితీరుపై మరోసారి బీఆర్ ఎస్ విమర్శల వర్షం కురిపించింది. పెద్దోళ్లకు ఒక న్యాయం.. పేదోళ్లకు ఒక న్యాయం పేరుతో తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. హైడ్రా బాధితులను ఇందులో భాగస్వాములను చేశారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఒక ఇంటి గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజర్ వచ్చి కూలగొట్టిందని, ఒక గర్భిణిని పక్కకు తోస్తే ఎలా ఉంటుందో అంతా ఆలోచించాలని పేర్కొన్నారు. మూడేళ్ల చిన్నారి భోజనం లేకండా ఏడ్చిన పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉందన్నారు.
కేటీఆర్ ప్రశ్నల వర్షం
* ఎఫ్టీఎల్ లో కడితే ఎవరిని వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారని ఈయన రాష్ట్ర రెవెన్యూ మంత్రి.. ఆయన ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ చేస్తారా?
* మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా?
* రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోపల ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది ఏ తప్పులేదు. పేదలకు అసలు టైమ్ ఇవ్వరు.. తిరుపతి రెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేస్తారు.
* ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉందా?
* మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి.. వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా?
* శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాలకు ప్రభుత్వమే అండగా ఉంది. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారు.
* మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్‌ను కూడా ఇప్పటి వరకు ఆపలేదు.. ఆ ధైర్యం హైడ్రాకు ఉందా?
………………………………………
