* లంబాడీలు ఎస్టీలు కాదు
*ఆదివాసీ సంఘాల నిరసన
ఆకేరు న్యూస్, ములుగు: లంబాడీలు ఎస్టీలే కాదని తమ హక్కులను దోచుకుంటున్నారని ఆదివాసీ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్టి జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసి సంఘాల నాయకులు సోమవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటిడిఏ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టి ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి, ఆదివాసి విద్యార్థి ,ఉద్యోగ, మహిళా సంఘాలు తుడుం దెబ్బ నాయకులు సుమారు 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ హక్కులను కాపాడుకొనుటకు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు ఆదివాసి యువత నడుం బిగించి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఆదివాసీలు విద్యా ,ఉద్యోగ, సామాజిక ,ఆర్థిక ,రాజకీయ రంగాలలో వెనకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు . అటవీ ప్రాంతంలో ఉన్న వనరులన్నింటిని లంబాడీలు దోచుక వెళ్తున్నారని ఆరోపించారు. దీంతో ఆదివాసి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారుతూ జీవనోపాధికై హైదరాబాద్ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకులు పట్టం ఉపేందర్ ,ఊకే రవి ,పాయం సత్యనారాయణ ,వాసం రామకృష్ణ, నరసింహమూర్తి ,కామరాజు, రామచంద్రు, సురేష్ ,సాయిబాబా, సమ్మయ్య ,కన్నరాజు, మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్ తోపాటు 2000మంది ఆదివాసి లు పాల్గొన్నారు . ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివాసీల నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

………………………………………..
