* బీఆర్ ఎస్ నేతల ఇళ్లలో అధికారుల తనిఖీలు
* పోలీసులే నగదు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న నేతలు
* హైదరాబాద్‌లో ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో హైదరాబాద్ బీఆర్ ఎస్ నేతల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మోతీనగర్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఎన్నికల కోసం భారీ ఎత్తున నగదు నిల్వ చేశారనే ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. భారీ బందోబస్తు తో ఆయా ఇళ్లకు వెళ్లిన అధికారులు నగదు నిల్వలపై సమాచారంతో తనిఖీలకు వచ్చినట్లు తెలిపారు. రవీందర్ రావు ఇల్లు కూకట్పల్లి నియోజకవర్గం రెహ్మత్ నగర్ పరిధిలో ఉండడంతో తమ ఇంటికి ఎందుకు వచ్చారని రవీందర్ రావు అధికారులను ప్రశ్నించారు. తాము ఎన్నికల కోడ్ పరిధిలో లేమని తెలిపారు. జిల్లా కూడా తమది హైదరాబాద్ కాదని, మేడ్చల్ అని తెలిపారు. సెర్చ్ వారంట్ ఉండాలని ప్రశ్నించారు. మరోవైపు జనార్దన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. తమ ఇంటికి కావాలనే పోలీసులు, అధికారులు విచ్చేశారని, వాళ్లే డబ్బు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సోదాలు అంశం తెలుసుకున్న బీఆర్ ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో జనార్దన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
