* చీకట్లో వైద్యంపై స్పందించిన కేటీఆర్
* ఈ దుస్థితికి కారకులెవరు అంటూ ఆగ్రహం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ కోతలు మొదలుకావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై సోషల్మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా తీసుకుని ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్.. సర్కారును దుమ్మెత్తి పోస్తోంది. ఇలాంటి సందర్భంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం రాత్రి కరెంట్ కట్ కావడం.., చీకట్లోనే వైద్యులు సేవలు అందించడం.., రోగులు ఇబ్బందులు పడడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు 5 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని కేటీఆర్ తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న చిన్నారులు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. కరెంట్ కోతలు లేవని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని నిలదీశారు. ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చీకటిలో చికిత్స పొందుతున్న మహిళ ఫొటోను షేర్ చేశారు. మీడియాలో వచ్చిన వార్తను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
———————