* చాపకిందనీరులా మాదకద్రవ్యాల విస్తరణ
* అడ్డుకట్టకు సిద్ధమైన పోలీసు యంత్రాంగం
* అన్ని విభాగాలతో సీపీ కీలక సమావేశం
* స్మగ్లర్స్‌పై డేగ కన్నుతో నిఘా
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
న్యూ ఇయర్ పార్టీలే లక్ష్యంగా హైదరాబాద్ మహా నగరాన్ని ‘మత్తు’లో ముంచేసేందుకు కొన్ని ముఠాలు వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఆటకట్టేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈమేరకు సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రౌడీషీటర్లపై ఎలాంటి నిఘా ఉంటుందో డ్రగ్స్ స్మగ్లర్స్, పెడ్లర్స్‌పై కూడా అదేస్థాయిలో నిఘా పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆదేశించారు.
దాడులు ముమ్మరం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు పోలీసులు దాడులు నిర్వహిస్తుంటే, మరోవైపు చాపకింద నీరులా గంజాయి, నల్లమందు, ఎండీఎంఏ, కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు నగరంలోకి విస్తరిస్తున్నాయి. కొరియర్ సర్వీస్‌లు, బస్సు రవాణా మార్గాల ద్వారా విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నాయి. పోలీస్ యంత్రాంగం మూకుమ్మడిగా దాడులు ముమ్మరం చేసినా అంతర్రాష్ట్ర ముఠాల ఆగడాలు ఆగడం లేదు. విద్యాలయాలు, టీ స్టాల్ నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు, పబ్బులు, క్లబ్బుల నుంచి బార్ అండ్ రెస్టారెంట్ల వరకు చివరకు టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, పాన్‌డబ్బాలు సైతం మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయంటే సిటీలో డ్రగ్స్ మహమ్మారి ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
త్వరలోనే న్యూ ఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ ముఠాలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర, లోకల్ డ్రగ్స్ స్మగ్లర్స్ ఆటకట్టించడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. ఇప్పటి వరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగానికి చిక్కిన స్మగ్లర్స్ వారి కాంటాక్టులో ఉన్న డ్రగ్స్ వినియోగదారుల జాబితాను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆ డేటాబేస్ ఆధారంగా డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారుల భరతం పట్టనున్నారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి 2022లో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) అనే ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన హెచ్ న్యూ.. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల ఆటకట్టించారు. ఒక్కో కేసులో డ్రగ్స్ మూలాలలోకి వెళ్లి మరీ అసలైన ఘరానా డ్రగ్స్ స్మగ్లర్స్‌కు చుక్కలు చూపించారు. నైజీరియన్ ఘరానా స్మగ్లర్స్‌ను కటకటాల్లోకి నెట్టారు. ప్రస్తుతం రెండు టీమ్‌లకే పరిమితమైన హెచ్ న్యూ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.
…………………………………………..

