* చేసిన ప్రయత్నాలు విఫలం
* పట్టించుకోని వినతులు
* పట్టున్న ప్రాంతాలు మరో డివిజన్‌లోకి
* కొత్త ప్రాంతాలు తమ పరిధిలోకి
* ఎన్నికలు వస్తే ఎలా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జీహెచ్ఎంసీ పునర్విభజన స్థానిక ప్రజలకు ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ.. కొందరు కార్పొరేటర్లలో గుబులు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జరిగే గెలుపోటములు తలకిందులు అయ్యేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు కారణం తమకు పట్టున్న ప్రాంతాలు తారుమారు కావడమే. ‘ఇన్నాళ్లూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మా వద్దకు వచ్చారు. వారి విజ్ఞప్తులకు స్పందించి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాం. అభివృద్ధి పనులూ చేశాం. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేశాం. దీంతో అక్కడి ప్రజలతో మాకు సత్సంబంధాలున్నాయి. పునర్విభజన పేరిట ఇప్పుడు ఆ ప్రాంతాలను వేరే డివిజన్లో కలిపారు. ఎన్నికలు వస్తే ఎలా?’ అనే ప్రశ్నలు కొందరు కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు.
వినతులు పట్టించుకోలే..
సాధారణంగా కొన్ని ఏరియాల్లో పార్టీలకు, కొన్ని చోట్ల వ్యక్తులకు పట్టు ఉంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రజల ఆదరణ పొందేలా, ఆ ప్రాంతాల్లో పట్టు సాధించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పునర్విభజనతో కొందరు కార్పొరేటర్ల ప్రణాళికలు తలకిందులయ్యాయి. తమకు ఆదరణ ఉన్న ప్రాంతాలను డివిజన్ నుంచి తొలగించడంతో టెన్షన్ పడుతున్నారు. ఏరియాలను తిరిగి కలపాలంటూ బల్దియా సర్కిల్, జోనల్, కేంద్ర కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఫలాన ప్రాంతం మా డివిజన్లో తిరిగి కలపాలని పలువురు కార్పొరేటర్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా చాలా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
కొన్ని ప్రాంతాలు ఇలా..
* తార్నాక డివిజన్లో మాణికేశ్వరినగర్ ప్రాంతం కీలకం. ఈ ఏరియాను బౌద్ధనగర్ డివిజన్లో కలిపారు. దీనిపై డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి ఆ ప్రాంత ప్రజలతో తమ ప్రత్యేక అనుబంధం ఉందని, తార్నాక డివిజన్లో మాణికేశ్వరినగర్ను తిరిగి కలపాలని కోరారు.
* భోలక్‌పూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీ, మేదర బస్తీ (ఇంటి నెంబర్ 1-5) ప్రాంతాలను భోలక్‌పూర్ డివిజన్ నుంచి ముషీరాబాద్‌లో కలిపారు. ఇదే డివిజన్లోని అంజుమన్ వీధి ప్రాంతంలో 70 శాతం ఏరియాను బాకారం డివిజన్లో కలిపారు. కృష్ణ కాలనీలో పార్కు కబ్జా నుంచి కాపాడా.. ఆ మూడు ప్రాంతాల్లో విస్తృత అభివృద్ధి చేశా.. ఇప్పుడా ఏరియాలను భోలక్‌పూర్ నుంచి తొలగించారని, ఇది తనకు ఎన్నికల్లో ఇబ్బందికరమే అని కార్పొరేటర్ గౌసుద్దీన్ తాష వాపోతున్నారు.
* మంగల్‌హట్ డివిజన్లోని కొన్ని ప్రాంతాలను విభజిస్తు దత్తాత్రేయనగర్ డివిజన్లో కలిపారు. ‘నేను పుట్టి పెరిగింది ధూల్‌పేట ప్రాంతంలో. ఇది మొదటి నుంచి మంగల్‌హట్ డివిజన్లో ఉంది. ఇప్పుడా ఏరియాను దత్తాత్రేయనగర్‌లో కలిపారు.
* మోండా మార్కెట్ డివిజన్లోని బండిమ్మెట్, పాలికాబజార్, మారుతి వీధి, ఆదయ్యనగర్, టకార బస్తీ, నాలా బజార్, మోండా మార్కెట్ ప్రాంతాలను బన్సిలాల్‌పేట డివిజన్లో కలపడంపై స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక ఆందోళన చెందుతున్నారు.
* అడ్డగుట్ట డివిజన్లోని లాలాగూడ, శాంతినగర్ ప్రాంతాలు నూతనంగా ఏర్పాటైన డివిజన్‌లోకి వెళ్లాయి. పార్టీకి పట్టున్న ప్రాంతాలను డివిజన్ నుంచి తొలగించడంపై కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి అసహనం వ్యక్తం చేస్తున్నారు. విభజనలో సహజ సరిహద్దులు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంటున్నారు.
* నల్లకుంట, ముషీరాబాద్ తదితర ఇతర డివిజన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. తమకు పట్టున్న ప్రాంతాలను ఇతర డివిజన్లలో కలపడంపై స్థానిక కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు.

