* కూకట్ పల్లి అర్జున్ థియేటర్లో ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా మొదటి రోజే చూడాలనుకున్నాడు.. ఎలాగోలా టికెట్ సంపాదించాడు .. గుండెల నిండా ఆనందంతో అభిమాన నటుడి సినిమా చూస్తున్నాడు…ఆనందంతో నిండిన హృదయం అంతలోనే ఆగిపోయింది..ఉన్నట్లుండి కుప్పకూలాడు.. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్లో సోమవారం చోటుచేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమాను చూస్తున్న ఆనంద్ కుమార్ అనే వ్యక్తి సినిమాను చూస్తూనే ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలి పోయాడు.. ఇది గమనించిన మిగతా ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే థియేటర్ యామాన్యం చేరుకునే లోపే అతడు మృతి చెందినట్లు తెలిసింది. ఆనంద్ కుమార్ మృతితో సినిమా థియేటర్ లో ఒక్కసారిగా విషాదవాతావరణం ఆవరించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సినిమా చూస్తున్న ఆనంద్ కుమార్ గుండెపోటు రావడంతో మృతిచెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే కచ్చితమైన కారణం వైద్యుల నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేశారు..మృతుడు ఆనంద్ కుమార్ గతంలో 12వ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేసి రిటైరైనట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. థియేటర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తూ..
గతంలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అనంతపురం పట్టణంలోని ఎస్వీ మ్యాక్స్ థియేటర్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తూ ఓబులేసు అనే వ్యక్తి మృతి చెందాడు.
………………………………………………………

