* భక్తుల జేబులు ఖాళీ చేస్తున్న వ్యాపారులు…
ఆకేరు న్యూస్, ములుగు:మేడారం మహా జాతర మరికొద్ది రోజుల్లో జనవరి 28 నుంచి 31 వరకు ప్రారంభం కానుంది. ముందస్తు మొక్కుల కోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనం కోసం మేడారం చేరుకుంటున్నారు. అయితే, భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని అక్కడి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ వస్తుంది. చలికాలం కావడంతో పిల్లలు, వృద్ధుల కోసం, కొందరు వ్యాపారులు కట్టెల పొయ్యిలపై నీటిని వేడి చేసి అమ్ముతున్నారు. ఒక్క బకెట్ వేడి నీళ్లకు ఏకంగా రూ50 వసూలు చేస్తున్నారు. అలాగే తక్కువ ధరకు లభించే కొబ్బరికాయలు ఇక్కడ ఒక్కటి రూ.60కి అమ్ముతున్నారు.కిలో కోడి ధర రూ.280 వరకు ఉంది.ఖాళీ స్థలాల్లో టెంట్లు వేసి రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు కిరాయి వసూలు చేస్తున్నారు.రూ.20 లభించే కూల్ డ్రింక్ రూ.40కి, వాటర్ బాటిళ్లను రూ.30కి విక్రయిస్తున్నారు.పూజా సామాగ్రి, బెల్లం, పసుపు, కుంకుమ ధరలు కూడా అధికమే…సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. పార్కింగ్ స్థలాల నుంచి గద్దెల వరకు వెళ్లడానికి ఆటో డ్రైవర్లు భారీగా వసూలు చేస్తున్నారు. జంపన్న వాగు నుంచి గద్దెల వరకు రూ.30, ఆర్టీసీ బస్టాండ్ నుంచి అయితే రూ.50 వరకు ఒక్కొక్కరి నుంచి తీసుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు.ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తే ఇలాంటి తిప్పలు తప్పవని అక్కడికొచ్చిన భక్తులు చెబుతున్నారు..జాతర పరిసరాల్లోఉన్న షాపుల వద్ద ఎక్కడా ధరల బోర్డు కనిపించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి జాతరలోనూ ఇలాంటి దోపిడీ జరుగుతున్నా, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని , ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరలను నియంత్రించాలని భక్తులు కోరుతున్నారు.
………………………………………………………..
