* అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
* జాతర లో విధ్యుత్ సరఫరాకు 196 ట్రాన్సఫార్మర్లు, 67 కి.మీ ఎలక్ట్రిక్ లైన్.
ఆకేరు న్యూస్, ములుగు: ఈనెల 28 నుండి 31 వరకు జరుగు మేడారం మహా జాతరకు హాజరు అయ్యే కోటిన్నర మంది భక్తులకు సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. మహా జాతరను పురస్కరించుకొని జంపన్న వాగులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ రెడ్డిగూడెం నుండి జంపన్న వాగు మీదుగా చిలకలగుట్ట వరకు నీటి మట్టాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జంపన్న వాగులో ఉన్న 29 ఇంఫిలిట్రేషన్ వెల్స్ ల పూడికను చేపట్టింది. స్నాన ఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ లను పునరుద్దరించడంతోపాటు బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లకు నిరంతర నీటిని అందించేందుకు ఇంఫిల్టరేషన్ వెల్స్ లో సుబ్మెర్సిబుల్ పంపులను ఏరాటు చేసి పైప్ లైన్లను ఏర్పాటు చేశారు.
జంపన్న వాగు పొడుగునా 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లను, 119 డ్రస్ చెంగింగ్ రూమ్ లను, జంపన్న వాగులో నీటి మట్టాన్ని ఒకే తీరుగా ఉంచేందుకు 9 క్రాస్ బండ్ లను నిర్మించారు. వీటితోపాటు, జంపన్న ఘాట్ లపై ఉన్న మెట్ల మరమత్తులు, జంపన్న వాగులో జలాలు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేపడుతున్నారు.
అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
తాడ్వాయి మండలంలో దట్టమైన అడవిలో జరిగే ఈ మేడారం జాతర సందర్బంగా అటవీ సంరక్షణ తోపాటుగా పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా, అటవీ సంపద ధ్వంసం కాకుండా ఉండేందుకు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ, దట్టమైన అడవుల గుండా వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రించడం లాంటి పనులను అటవీ శాఖ చేపట్టింది. వీటితోపాటు, ఖాళీగా ఉన్న అటవీ భూములలో పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
నిరంతర విధ్యుత్ సరఫరాకు 196 ట్రాన్సఫార్మర్లు, 67 కి.మీ ఎలక్ట్రిక్ లైను
మేడారం జాతరలో అంత్యంత కీలకమైన విధ్యుత్ శాఖ, 24 గంటలూ ఏ ఒక్క నిమిషం కూడా విధ్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 911 ఎలక్ట్రిక్ స్తంబాలు, 196 ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేసి వీటి నిర్వహణకు 350 అదనపు సిబ్బందిని నియమించింది. వీటితోపాటు, 43 పార్కింగ్ ప్రాంతాలలో కూడా విధ్యుత్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే, జాతర ప్రాంతంలో ఉన్న 11 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్ లను సిద్ధం చేసింది. భక్తుల రక్షణ చర్యల్లో భాగంగా, 11 కేవీ, 33 కేవీ లైన్లు క్రాస్ అయ్యే జంపన్న వాగు వద్ద ఆరు గస్తీ టవర్లను ఏర్పాటుచేశారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. తాడ్వాయి, పస్రా మార్గంలో పెట్రోలింగ్ టీమ్ లను కూడా నియమించారు. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లను సునాయాసంగా దర్శించుకుని ప్రశాంతంగా తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు ఆర్టిసి బస్సు సౌకర్యం సైతం కల్పించారు.

…………………………………………..
