Mahabubabad Kargil Vijay Diwas
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక సరిహద్దుల్లో పోరాడి అమరులైన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయానికి గుర్తుగా శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘కార్గిల్ విజయ్ దివాస్’ వేడుకలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
* హోరెత్తిన జాతీయ నినాదాలు.. భారీ ర్యాలీ…
ఈ సందర్భంగా పట్టణంలో భారీ దేశభక్తి ర్యాలీని చేపట్టారు. స్థానిక జిల్లా ప్రధాన వైద్యశాల (ఏరియా హాస్పిటల్) ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగుతూ తహసీల్దార్ కార్యాలయం వరకు ఉత్సాహంగా సాగింది. మాజీ సైనికులు, విద్యార్థులు, యువకులు చేతుల్లో జాతీయ జెండాలు చేతబూని “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం”, “అమర్ రహే అమర్ రహే.. జవాన్ అమర్ రహే” అంటూ చేసిన నినాదాలతో మహబూబాబాద్ పురవీధులు మారుమోగాయి.
* అమరవీరులకు శ్రద్ధాంజలి – విజేతలకు బహుమతుల ప్రదానం…
ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్గిల్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
* మహబూబాబాద్‌లో ‘కార్గిల్ స్మారక స్థూపం’ ఏర్పాటు చేస్తాం- ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ…
“మనమంతా ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో మైనస్ డిగ్రీల చలిని, మంచు తుఫాన్లను తట్టుకుని అహర్నిశలూ కాపలా కాస్తున్న మన వీర సైనికులే. కన్నవారిని, కట్టుకున్నవారిని, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను విడిచిపెట్టి దేశ భద్రతే ధ్యేయంగా పోరాడే సైనికుల త్యాగం అమూల్యమైనది.
మాజీ సైనికుల గౌరవార్థం మరియు వారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు గుర్తుచేసేలా మహబూబాబాద్ పట్టణంలో త్వరలోనే ‘కార్గిల్ స్మారక స్థూపాన్ని’ ఏర్పాటు చేస్తాం. మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
