* జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్…
ఆకేరు న్యూస్,అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం అమరావతి వేదికగా ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన, సుమారు 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఉత్సవాలను కన్నులపండువగా ఏర్పాటు చేశారు.ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు మరియు రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను తిలకించారు.రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో 22 శకటాలను ప్రదర్శించారు.దేశభక్తిని చాటిచెప్పేలా రూపొందించిన వందేమాతరం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీరో పావర్టీ మిషన్, విద్యా రంగంలో సంస్కరణలు, వైద్య ఆరోగ్య రంగ ప్రగతి, స్త్రీ శిశు సంక్షేమం మరియు యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై రూపొందించిన శకటాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, అమరావతి వేదికగా జరిగిన ఈ గణతంత్ర వేడుకలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
………………………………………………….
