ఆకేరు న్యూస్,హైదరాబాద్: అమాయక ప్రజలే కాదు, చట్టాల గురించి తెలిసిన వారు కూడా సైబర్ నేరగాళ్ల మాయమాటలకు బలి అవుతున్నారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా న్యాయవాది ఏకంగా రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు.రామంతాపూర్ ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల మహిళా న్యాయవాదికి గత డిసెంబర్లో వాట్సాప్‌లో ఒక లింక్ వచ్చింది. అది క్లిక్ చేయగానే ఆమె “టీ పార్టీ” (Tea Party) అనే గ్రూప్‌లో చేరారు. ఆ గ్రూప్‌లోని అడ్మిన్లు, సభ్యులు స్టాక్ ట్రేడింగ్‌లో వేలల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని నమ్మించారు.మొదటగా ఆమెను నమ్మించడానికి రూ.10 వేలు పెట్టుబడి పెట్టించారు. వెంటనే దానికి లాభం వచ్చినట్లు చూపించి, విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. దీనితో అది నిజమైన ప్లాట్‌ఫామ్ అని నమ్మిన బాధితురాలు, దశలవారీగా తన వద్ద ఉన్న రూ.40 లక్షలను సైబర్ నేరగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఆమె ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి లాభాలతో కలిపి వాలెట్లో రూ.70 లక్షలు ఉన్నట్లు స్క్రీన్‌పై కనిపించింది. అయితే, ఆ మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాలోకి మార్చుకుందామని ప్రయత్నించగా అసలు కష్టం మొదలైంది.డబ్బు డ్రా చేయాలంటే ‘ట్యాక్స్’ కట్టాలని వేధించారు. ‘ప్రాసెసింగ్ ఫీజు’ పేరిట మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి ఆమె పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి ఇవ్వకుండా విత్‌డ్రాలు బ్లాక్ చేశారు.అనుమానం వచ్చి గ్రూప్ అడ్మిన్లను సంప్రదించగా, వారు స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
……………………………………………………..
