* మీ బిడ్డలను బయటకు పంపేటప్పుడు జాగ్రత్త
* జీహెచ్ఎంసీలో గణనీయంగా పెరుగుతున్న కుక్కల సంఖ్య
* రికార్డుల్లోనే వ్యాక్సినేషన్, శస్త్ర చికిత్సలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
మీ పిల్లలను కిరాణ దుకాణానికో, బడికో ఒంటరిగా పంపుతున్నారా? అలాంటి తల్లిదండ్రులకు హెచ్చరిక. మీ చిన్నారులు కుక్కల దాడి బారిన పడొచ్చు జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మహా నగరంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. చిన్నారుల ప్రాణాలు పోయినా పదుల సంఖ్యలో పౌరులు బాధితులుగా మారుతున్నా, కుక్కలు వెంటపడడంతో వాహనాలపై నుంచి కిందపడి క్షతగాత్రులుగా మారుతున్నా.. జీహెచ్ఎంసీ మేలుకోవడం లేదు.
చిన్నారులే సమిధలు
ఇటీవల ఖైరతాబాద్‌లోని శ్రీనివాసనగర్‌లో నాలుగేళ్ల చిన్నారి శార్వి (4)పై వీధి కుక్క దాడి చేసింది. దీంతో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గతంలోనూ అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గుంపుగా వచ్చిన వీధి కుక్కలు ఆ బాలుడిని తీవ్రంగా గాయపర్చాయి. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రేటర్లో వీధి కుక్కల దాడిలో ఎక్కువగా గాయపడుతోన్నది, కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్నది చిన్నారులే. ఇళ్ల ముందు ఆడుకుంటున్న, వివిధ పనులు నిమిత్తం బయటకు వెళ్తోన్న చిన్నారులను వీధి కుక్కలు కరుస్తున్నాయి.
నియంత్రణ ఖర్చు రూ.10 కోట్లు
వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ (ఏబీసీ) కోసం ఏటా రూ.10 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా కుక్కకాటు కేసులు, వాటి వల్ల మరణాలు మాత్రం తగ్గడం లేదు. కుక్కలను పట్టుకోవడం నుంచి వాటికి శస్త్రచికిత్స, కొన్ని రోజుల పాటు యానిమల్ కేర్ సెంటర్లలో సంరక్షణ బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలకు బల్దియా అప్పగించింది. ఇందుకోసం ఒక్కో కుక్కకు రూ.1500కు పైగా చెల్లిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం పూర్వ జీహెచ్ఎంసీ పరిధిలో 3.86 లక్షల వీధి కుక్కలున్నాయి. ఇందులో 70 శాతానికిపైగా వ్యాక్సినేషన్, శస్త్రచికిత్సలు జరిగాయని చెబుతుంటారు. కానీ ఇందులో లక్షకుపైగా కుక్కలకు వ్యాక్సినేషన్, శస్త్ర చికిత్సలు జరగలేదని ఓ అంచనా అంచనా.
ప్రజాధనం వృథా
సర్కిల్‌కు ఒకటి, కొన్ని చోట్ల రెండు చొప్పున డాగ్ క్యాచ్ టీంలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఆధీనంలో కొన్ని.. స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో కొన్ని బృందాలు పని చేస్తున్నాయి. వాస్తవంగా నిత్యం తమ పరిధిలోని ప్రాంతాల్లో తిరుగుతూ.. వ్యాక్సినేషన్, శస్త్ర చికిత్స చేయని వీధి కుక్కలను పట్టుకొచ్చి జంతు సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలి. కానీ ఫిర్యాదు చేస్తే తప్ప ఈ బృందాలు క్షేత్రస్థాయిలో కనిపించవు. కానీ రికార్డుల్లో మాత్రం నిత్యం వ్యాక్సినేషన్, శస్త్ర చికిత్సలు చేసినట్టు చూపుతున్నారు. తద్వారా రూ.కోట్ల ప్రజాధనం కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
…………………………………………………….
