మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
* క్లై మాక్స్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు
* ఒక్క సారిగా పెరిగిన పొలిటికల్ హీట్
* ఐదు గంటల పాటు కేసీఆర్ విచారణ
* ఆందోళనలతో రోడ్డెక్కిన గులాబీ సేన
* మరో వైపు మునిసిపల్ పోరు
ప్రత్యేక ప్రతినిధి , ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న “ఫోన్ ట్యాపింగ్ స ఉదంతం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో సిట్ (SIT) అధికారులు ఐదు గంటల పాటు జరిపిన విచారణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. ఒక వైపు మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సిట్ అధికారులు కేసీఆర్ ను పిలవడం రాజకీయ ప్రాధాన్యతను పెంచింది. బీఆర్ ఎస్ , కాంగ్రెస్ రెండు పక్షాలు దీన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్ళేందుకు ఉపయోగించుకోవాలన్న వ్యూహం కనిపించింది. మాజీ ఎస్ ఐబీ అధికారులు , మాజీ మంత్రులు, హరీశ్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను ఇంతుకు ముందే ఇదే కేసులు సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు కేంద్రంగా సిట్ భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా విచారణకు పిలవడంతో అనంతర పరిణామాల గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో సారి కూడా కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశాలు లేక పోలేదని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రజల వద్దకు ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలనే ఆలోచన బీఆర్ ఎస్ నేతలు చేస్తున్నారు..
* ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చి ఉంటారు..?
సిట్ విచారణ అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారని అందరూ ఊహించారు. కేసీఆర్ మాత్రం ఎర వల్లి ఫామ్ హౌజ్‌కు వెల్లి పోయారు. రేపు ప్రెస్ మీట్ అవకాశాలు లేక పోలేదన్న ప్రచారం ఉంది. అసలు కేసీఆర్‌ను సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేశారు..? వాటికి కేసీఆర్ ఏవిదంగా సమాదానాలు ఇచ్చి ఉంటారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలకు సంబందించిన విచారణలో బయట ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా కాకుండా క్లుప్తంగానే సమాధానాలు చెబుతారు. ఇలాంటి విషయాల్లో సాధారణంగా న్యాయ నిపుణులు సలహాలు పాటిస్తారు.. మరో వైపు వీడియో రికార్డింగ్ కూడా ఉండడంతో చాలా జాగ్రత్తగానే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సూటిగా విషయంలోకి రాకుండా .కేసుకు సంబందం లేని అనేక విషయాలను యాధాలాపంగా అడిగినట్లుగానే అడుగుతారు.. మద్యలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబందించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బహుశా ఇలాంటి ప్రశ్నలు అడిగి ఉండవచ్చని మాజీ పోలీస్ అధికారులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
* ఇంటెలిజెన్స్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయమని మీరు ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చారా..?
* అరెస్టయిన పోలీసు అధికారులతో మీకు ఉన్న సంబంధం ఏంటి? వారు రిపోర్ట్స్ నేరుగా మీకే ఇచ్చేవారా.?
*ప్రతిపక్ష నేతల వ్యక్తిగత విషయాల డేటా మీ వద్దకు ఎలా వచ్చేది..?
* ధ్వంసం చేయబడిన హార్డ్ డిస్క్‌ల వెనుక మీ అనుమతి ఉందా..?
అదే విదంగా గతంలో పోలీస్ అధికారులు, మాజీ మంత్రులు , మాజీ ఎంపీ లు విచారణ లో భాగంగా ఇచ్చిన వాంగ్మూలాలను ముందుంచి మీకు సంబందం లేదని ఎలా అంటారు .. అనే విదంగా ప్రశ్నిస్తారంటున్నారు.. కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని లేదా ఆదారాలను నాశనం చేశామని చెప్పినట్లుగా ఉండే పత్రాలను ముందుంచి ప్రశ్నించే అవకాశాలు లేక పోలేదంటున్నారు..? కేసీఆర్ సైతం ధీటుగా ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా తాను సంతకం చేసి మరీ ఇలాంటి విషయాల జోలికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి కేసీఆర్ నిర్భయంగా తనను విచారించడం ఒక రాజకీయ కుట్ర అని వాదించే అవకాశాలే లేక పోలేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ సందర్భంగా అసలీ ఫోన్ ట్యాపింగ్ వివాదం ఏంటో పరిశీలిద్దాం..
* అసలీ ఫోన్ ట్యాపింగ్ వివాదం ఏంటి..?
రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి “గోప్యత” (Privacy) ప్రాథమిక హక్కు. అయితే, దేశ భద్రత లేదా తీవ్రమైన నేరాల విచారణ సమయంలో మాత్రమే ప్రభుత్వం అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. భారత టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం, హోం సెక్రటరీ అనుమతి లేకుండా జరిగే ప్రతి ట్యాపింగ్ నేరమే అవుతుంది కాగా బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీ నేత రేవంత్ రెడ్డి , ఇతర కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు సొంత పార్టీ నేతల వ్యక్తిగత సంభాషణలను విన్నారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారగానే ఇంటెలిజెన్స్ విభాగంలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి, ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం జరిగిందని సిట్ నిర్ధారించింది. ఎన్నికల సమయంలో నిధుల మళ్ళింపును అడ్డుకోవడం, ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారనేది ప్రధాన అభియోగం.
—————————–
