* గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు
* రాజకీయ నాయకుడు బాబా సిద్దికీ హత్య
* తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్
ఆకేరు న్యూస్ , డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రమేయం ఉన్నట్లు తేలింది . గతంలో నటుడు సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అదే గ్యాంగ్, ఇప్పుడు రోహిత్ శెట్టిని హెచ్చరించడం బాలీవుడ్లో భయాందోళనలు కలిగిస్తోంది.
* రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు
ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న రోహిత్ శెట్టి నివాసం ‘శెట్టి టవర్’ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సుమారు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, భవనం మొదటి అంతస్తులోని జిమ్ గ్లాస్ ప్యానెల్ ధ్వంసమైంది.కాల్పులు జరిగిన కొద్దిసేపటికే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన శుభమ్ లోంకర్, ఆర్జూ బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.
* ఇదీ ట్రైలర్ మాత్రమే… నటా
“మేము రోహిత్ శెట్టికి మా పనిలో జోక్యం చేసుకోవద్దని చాలాసార్లు మెసేజ్ చేశాం, కానీ అతను అర్థం చేసుకోలేదు. ఇది కేవలం చిన్న ‘ట్రైలర్’ మాత్రమే. మాట వినకపోతే తదుపరి బుల్లెట్లు ఇంటి బయట కాదు, నేరుగా బెడ్రూమ్లోకి వచ్చి నీ గుండెల్లోకి దిగుతాయి” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.బాలీవుడ్ ప్రముఖులు తమ పద్ధతి మార్చుకోకపోతే, వారి పరిస్థితి గతేడాది హత్యకు గురైన రాజకీయ నేత బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో పూణేలో ఐదుగురు అనుమానితులను స్వప్నిల్ సాకత్, సిద్ధార్థ్ ఎన్పురే, ఆదిత్య గాయకీ, సమర్థ్ పొమాజీ, అమన్ మరోటే లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు పూణే నుండి బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి, ఆ తర్వాత బైక్‌ను వదిలివేసి పరారైనట్లు గుర్తించారు. వీరికి బిష్ణోయ్ ముఠాతో ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
*గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు
రోహిత్ శెట్టి కంటే ముందు, నటుడు సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ప్రధాన లక్ష్యంగా ఉన్నారు. గెలాక్సీ అపార్ట్మెంట్స్ ఘటన (2024): ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కూడా ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 1998లో జరిగిన కృష్ణ జింకల (Blackbuck) వేట కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడు కావడమే దీనికి ప్రధాన కారణం. బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను పవిత్రంగా భావిస్తుంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్ణోయ్ బహిరంగంగానే ప్రకటించాడు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కెనడా నుంచి గ్యాంగ్ కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు సమాచారం.
*రోహిత్ శెట్టిని ఎందుకు టార్గెట్ చేశారు…?
రోహిత్ శెట్టి సాధారణంగా తన సినిమాల్లో పోలీసులను హీరోలుగా (సింగం, సింబా) చూపిస్తుంటారు. అయితే, బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొన్న “మా పనిలో జోక్యం” అనేది దేనిని ఉద్దేశించి అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కొందరు దీనిని వసూళ్ల (Extortion) కోసం చేసిన బెదిరింపుగా భావిస్తుండగా, మరికొందరు ఏదైనా నిర్దిష్ట సినిమా ప్రాజెక్టుపై ముఠాకు అభ్యంతరాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా
ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై పోలీసులు బాలీవుడ్ ప్రముఖులందరినీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ గ్యాంగ్ వార్ బాలీవుడ్‌ను నీడలా వెంటాడుతుండటం చిత్ర పరిశ్రమను కలవరపెడుతోంది.
————————————–
