– విషాదంలో అధ్యాపకులు, విద్యార్థులు
ఆకేరు న్యూస్, కమలాపూర్: అధ్యాపకుడు క్లాస్ చెప్తుండగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే గూడూరు గ్రామానికి చెందిన నన్నబోయిన శ్రీశైలం గత 11 సంవత్సరాలుగా గురుకుల జూనియర్ కళాశాలలో అతిధి లెక్చరర్ గా పని చేస్తున్నాడు. రోజులాగే సోమవారం కాలేజీకి వెళ్ళాడు. క్లాస్ రూమ్ లో అటెండెన్స్ తీసుకొని, పాఠ్యాంశం బోధిస్తుండగా వాంతి చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి అధ్యాపకులు వెంటనే అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి, అక్కడి నుంచి 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ యజమాని ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆయన మృతి పట్ల, ఉపాధ్యాయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.విద్యార్థులే లోకం గా, విద్యార్థులే ప్రాణంలా ఉండే అధ్యాపకుడు లేడనీ విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
