Heavy Rains Telangana
*కేసముద్రంలో 20.5 సెంటీమీటర్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కొంతకాలంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు భారీ వర్షాలు ఉపశమనం కలిగించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
శనివారం రాత్రి ప్రారంభమైన వానలు ఆదివారం కూడా కొనసాగాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్‌తో పాటు యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఈ సీజన్లో తొలిసారిగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 20 సెంటీమీటర్ల మార్కును దాటింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అత్యధికంగా 20.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లికుదురులో 15.6, కన్నెపల్లిలో 14.9, రాయపర్తిలో 14.6, దత్తప్పగూడలో 14.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
* పలుచోట్ల భారీ వర్షాలు..
మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.
* కేసముద్రంలో రికార్డు స్థాయి వర్షం..
ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతంతో పోలిస్తే కేసముద్రంలో కురిసిన వర్షం అత్యధికంగా నిలిచింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 15.6 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14.9, వరంగల్ జిల్లా రాయపర్తిలో 14.6, యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడలో 14.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అలాగే కొమ్ములవంచలో 14, వడ్డెకొత్తపల్లిలో 13, రామన్నపేటలో 12.8, వర్ధన్నపేటలో 12.6, కొడకండ్లలో 12.6, శాలిగౌరారంలో 12.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇనుగుర్తి, మునిగలవీడులో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
* హైదరాబాద్‌లోనూ ముసురు..
భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్‌పైనా కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ముసురు వాతావరణం కొనసాగింది. బాచుపల్లిలో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఆర్సీపురంలో 4.3, పటాన్చెరులో 4.1, మియాపూర్‌లో 3.5, ఘన్‌పూర్‌లో 3.4, మేడ్చల్‌లో 3.2, బంజారాహిల్స్‌లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
* పొంగిన వాగులు.. నిండిన చెరువులు..
మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెక్‌డ్యామ్‌లు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువు సైతం మత్తడి పోయడంతో పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగింది.
భారీ వరదలకు కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మడిపల్లి సమీపంలో అప్రోచ్ రోడ్డు దెబ్బతింది. రావిరాల వద్ద వాగు ప్రవాహం పెరగడంతో తొర్రూరు–మహబూబాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముప్పారం సమీపంలో పాలేరు వాగు రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
తొర్రూరు మండలం గోపాలగిరి సమీపంలో పంట పొలాలు నీట మునిగాయి. నెల్లికుదురు–తొర్రూరు మార్గంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు వరద నీటి ఉధృతికి దెబ్బతింది. దీంతో దంతాలపల్లి–పెద్దముప్పారం మధ్య రాకపోకలు ప్రభావితమయ్యాయి.
* భూపాలపల్లిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపైనా ప్రభావం చూపాయి. కేటీకే-2, కేటీకే-3 ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో ఓవర్‌బర్డెన్ తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
రెండు రోజులుగా మూడు షిఫ్టుల్లో పనులు ప్రభావితమవడంతో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా సింగరేణికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
*మరో రెండు రోజులు వర్ష సూచన..
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రత్యక్ష ప్రభావం తగ్గినప్పటికీ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత అల్పపీడనం ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షాలు తగ్గిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఉక్కపోత పెరిగే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
